టిడిపిలోకి మారేందుకు ఎదురు చూస్తున్న మాజీ హోమ్ మంత్రి సుచరిత తొందరపాటుతో చేటు తెచ్చిన్నట్లు తెలుస్తున్నది. రెండోసారి మంత్రి పదవి రాకపోవడంతో వైసిపి నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండడంతో టిడిపి అభ్యర్థిగా బాపట్ల నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న భర్త దయాసాగర్ తో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఒక విధంగా సిద్ధమయ్యారు.
అయితే భర్త ఈ విషయమై టిడిపి నాయకులతో జరుపుతున్న సమాలోచనలు ఒక ఒక కొలిక్కి రాకముందే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుండి గ్రీన్ సిగ్నల్ లభించక ముందే “భర్త ఏ పార్టీలో ఉంటె అదే పార్టీలో ఉంటాను” అంటూ నర్మగర్భంగా తన పార్టీ మార్పు గురించి సంకేతం ఇచ్చి సుచరిత ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లు అయింది.
టిడిపిలో బాపట్ల సీట్ ఖరారు అయితే గాని భర్త ఆ పార్టీలో చేరే విషయం కూడా స్పష్టం కాదు. సీట్ విషయంలో స్పష్టత లేకుండా “భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో, పిల్లలు ఇంకో పార్టీలో ఉంటారా?” అంటూ వైసిపిలో కొనసాగడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఆమె మాట్లాడటం కలకలం రేపింది.
టిడిపి వర్గాల కధనాల మేరకు సుచరిత భర్త దయాసాగర్ బాపట్ల సీట్ విషయమై రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను కలసి చర్చించినట్లు తెలిసింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇక టిడిపి సీట్ తనకు వచ్చిన్నట్లు భావిస్తున్నారు.
అయితే ఈ విషయమై రవీంద్రకుమార్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుతో గాని, టిడిపిలో ఎన్నికల వ్యూహాల గురించి తెరవెనుక వ్యూహాలు రూపొందిస్తున్న బృందాలతో గాని చర్చించనే లేదు. దానితో టిడిపి వర్గాల దృష్టిలో దయాసాగర్ ప్రస్తావనే ఇప్పటి వరకు రాలేదు.
ఇంతలో సుచరిత అసహనంతో మాట్లాడు జారడంతో భర్త దయాసాగర్ కూడా అవాక్కయిన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక క్రమబద్ధంగా తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, ఆయనకు సన్నిహితంగా ఉన్న నాయకులు అందరిని వదిలించుకొంటున్నారు. ఈ క్రమంలోనే సుచరితకు 2024 ఎన్నికల తర్వాత కూడా మంత్రిపదవి వచ్చే అవకాశం లేదు.
పైగా, ఆమె హోమ్ మంత్రిగా ఉన్న సమయంలో సహితం అంతా పెత్తనం సజ్జల రామకృష్ణారెడ్డి చేసేవారు. మంత్రిత్వ శాఖలో సహితం ఆమె మాటకు విలువ ఉండెడిది కాదు. గుంటూరు జిల్లాలో ఆమె ఒక్కరే మంత్రి అయినా, ఆమెతో సంబంధం లేకుండా సజ్జల కనుసన్నలలో అధికార కార్యక్రమాలు జరుగుతూ ఉండెడివి.
ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు టిడిపికి సహితం బలమైన అభ్యర్థి లేరు. దానితో ఆ పార్టీలో చేరితే మరోసారి ఎమ్యెల్యేలుగా గెలవడమే కాకుండా, టిడిపి ప్రభుత్వం వస్తే మంత్రిపదవి కూడా దక్కే అవకాశం ఉందని ఆమె అంచనాలు వేసుకొంటున్నారు. అయితే, ఈ విషయమై ఇప్పటి వరకు టీడీపీ వర్గాల నుండి ఎటువంటి సానుకూలత వ్యక్తం కాలేదు.
దానితో, ఇప్పుడు మాట మార్చి వైసిపి నుండి నిష్క్రమిస్తే ఇంట్లో కూర్చుంటాను గాని పార్టీ మారాను అని స్పష్టం చేస్తున్నారు. అంతేగాని వైసిపిలోనే ఉంటాను అని మాత్రం చెప్పడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదాయపన్ను కమిషనర్ అయిన తన భర్తకు ఇబ్బందులు వస్తాయని భయపడకుండా వైసిపిలో చేరానని గుర్తు చేయడం గమనార్హం.