పాదయాత్రలో అడుగడుగునా లోకేష్ పై పోలీస్ కేసులు

Sunday, December 22, 2024

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన `యువగలం’ పాదయాత్ర ఒక వంక 10వ రోజుకు చేరుకోగా, ప్రతిచోటా అన్ని వర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. మరో వంక అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా, నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ  లోకేశ్‌ పైననే కేసు నమోదు చేశారు. పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తి చేసేసరికే తనపై 16 కేసులు పెట్టారని పేర్కొంటూ తనను చూస్తే ప్రభుత్వానికి భయమని లోకేష్ ఎద్దేవా చేశారు.

ఆయనతోపాటు మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్,డి టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగారుపాళ్యం నాలుగు రోడ్ల కూడలి వద్దకు శుక్రవారం సాయంత్రం పాదయాత్ర చేరుకోగా బహిరంగ సభకు అనుమతులు లేవంటూ పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు.

తాము పాదయాత్రగానే వచ్చామని సభ నిర్వహించలేదని చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదంతో రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఓ ఇంటి బాల్కనీ నుంచి లోకేశ్‌ మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సౌండ్‌ సిస్టం వాహనాలు, లైవ్‌ వీడియో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి బంగారుపాళ్యం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు 353, 188, 341 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో అమరనాథరెడ్డి ఏ-1గా, పులివర్తి నాని ఏ-2గా, నారా లోకేశ్‌ ఏ-3గా, దీపక్‌రెడ్డి ఏ-4గా చూపారు. అనుమతి లేకుండా వాడుతున్న సౌండ్‌ సిస్టం వాహనాలను సీజ్‌ చేసేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

బంగారుపాళ్యంలో శుక్రవారం సాయంత్రం సీజ్‌ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన తమపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారన్న పలమనేరు రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న తమను చంపాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు జయప్రకాష్‌, జగదీష్‌, కొదండయాదవ్‌, మరి కొందరు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇందులో కొంత మంది పొలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు సెక్షన్‌ 332, 307, 143, 341, 149 కింద కేసు నమోదైంది. పొలిసు స్టేషన్ లోనే పోలీసులపై హత్యాయత్నం జరిపారంటూ కేసు నమోదు చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో మరోసారి పొలిసు అధికారులు స్పష్టం చేశారు.

కాగా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘యువగళం’ పాదయాత్ర ఆగబోదని నారా లోకేశ్‌ మరోసారి తేల్చిచెప్పారు. శనివారం 9వ రోజు పాదయాత్రలో భాగంగా ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల పరిధిలో పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన పాదయాత్రలో వినియోగిస్తున్న రెండు సౌండ్‌ వెహికల్స్‌ను పోలీసులు సీజ్‌ చేసి పట్టుకెళ్లిపోయారని, చివరికి తాను ప్రసంగాలకు వినియోగిస్తున్న స్టూలు కూడా ఎత్తుకెళ్లారని విమర్శించారు.

అందుకే తాను చిన్న మైక్‌ తీసుకుని మాట్లాడుతున్నానని చెప్పారు. తాను స్టాన్‌ ఫోర్డులో చదివానని, ఎలాంటి తప్పూ చేయలేదని లోకేష్ స్ఫష్టం చేశారు. జగన్‌ లక్ష కోట్లు తినేసి 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిన్న వ్యక్తి అని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయమంత్రి కేబినెట్‌ భేటీలో సగం టైమ్‌ రైతుల ఇబ్బందులపైనే మాట్లాడేవారని, కానీ అందరూ దొంగతనాలు చేసి కోర్టుకు వెళితే ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశాడని ఆరోపించారు.

ఇలా  ఉండగా,లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డంకులు కల్పించబోరని అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాశ్‌ స్పష్టం చేశారు. సుప్రీకోర్టు మార్గదర్శకాల మేరకు మాత్రమే పోలీసులు నడుచుకుంటారని చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles