2023లో తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదవ విడతగా సోమవారం నుండి ప్రారంభించారు. అయితే మొదటి రెండు విడతలలో పార్టీ శ్రేణులలో కలిగించిన ఈ పాదయాత్ర ఆ తర్వాత ప్రభావం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది.
మధ్యలో టిఆర్ఎస్ అగ్రనేత ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం, హుజురాబాద్ నుండి ఉప ఎన్నికలలో పోటీచేసి అనూహ్య విజయం సాధించడంతో పార్టీ నేతల దృష్టి అటువైపు మళ్లింది. అదే విధంగా మొదటి రెండు విడతల పాదయాత్ర సందర్భంగా వివిధ పార్టీల నుండి చేరికలు ఆకర్షించిన సంజయ్ ఆ తర్వాత పెద్దగా ఆకర్షింపలేక పోతున్నారు.
మరోవంక, సంజయ్ నాయకత్వం పట్ల పార్టీలో కీలక నాయకులు అనేకమంది తీవ్ర అసంతృప్తి పార్టీ అధిష్ఠానం వద్ద వ్యక్తం చేస్తుండటం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. పార్టీలో ఎవ్వరికీ ప్రాధాన్యత కలిపించినా తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందో అనే అభద్రతా భావంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయడంలో కీలకంగా మారిన ఈటెల రాజేందర్ ను పార్టీలో చేరుకోవడానికి అడ్డుకునే ప్రయత్నం చేశారని, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని పార్టీలో చేరేటట్లు చేసారని చెబుతున్నారు. సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నకైనా తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి గెలుపొందినా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విశేషమైన విజయాలు సాధించినా ఎక్కడ సంజయ్ ప్రమేయం ఉన్నట్లు ఎవ్వరు భావించడం లేదు.
దానితో తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటున్న కొలది సంజయ్ రాజకీయంగా అభద్రతా భావంతో వ్యవహరిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్యెల్యేల కొనుగోలు కేసు విషయంలో సహితం సంజయ్ వ్యవహరించిన తీరే పార్టీని మరింతగా అప్రదిష్టపాలు చేసినట్లు పలువురు భావిస్తున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ను `దోషిగా’ నిలబెట్టిన ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తుంటే వ్యూహాత్మకంగా పార్టీని ఎదుర్కొనే విధంగా చేయడంలో సంజయ్ నిస్సహాయంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఒక విధంగా పార్టీ తెలంగాణలో విషమ పరీక్ష ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన పాదయాత్ర జరుగుతుంది.
5 జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 20 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. సంజయ్ ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కిలోమీటర్లకు పైగా నడిచారు.
భజనపరులకే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలో అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంస్థాగత వ్యవహారాలు చూసే ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉండడంతో నాయకుల మధ్య వారధిగా నిలిచేవారు లేని లోపం మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా స్పష్టంగా కనబడింది.
పార్టీ జాతీయ నాయకత్వం సహితం తెలంగాణకు సంబంధించి నేరుగా ముఖ్యమైన నాయకులతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర అధ్యక్షునిపై ఎక్కువగా ఆధార పడటం లేదు. పలు విషయాలలో సంజయ్ సూచనలను పట్టించుకోవడం లేదు. దానితో పలు అధికార కేంద్రాలు పార్టీలో ఏర్పడటంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.
సంజయ్ బృందంలోని చాలామందికి ప్రజాక్షేత్రంలో సంబంధం లేనివారే కావడం, పలు వ్యాపారాలపై ఆధారపడిన వారు కావడంతో ప్రజలపై ప్రభావం చూపే విధంగా కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నారు. పైగా, సంజయ్ నిత్యం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని దూషించడమే గాని ప్రజలను హత్తుకొనే విధంగా సమస్యలపై, విధానాలపై వివరించలేక పోతున్నారని విమర్శలున్నాయి.
అటు, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇతర టిఆర్ఎస్ నాయకులు ఎవ్వరు మాట్లాడినా వ్యూహాత్మకంగా ప్రజలను ఆకట్టుకొనే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీలో సహితం ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, జి కిషన్ రెడ్డి వంటి వారు ఆ విధంగా మాట్లాడ గలుగుతున్నారు. అసలు టిఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో సమిష్టిగా, వ్యూహాత్మకంగా పార్టీని ముందు తీసుకు వెళ్లే ప్రయత్నం సంజయ్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.
పార్టీ కార్యక్రమాలు అన్నింటిని తనను ఫోకస్ చేసుకొనే విధంగా చేస్తూ, తన కేంద్రంగా మాత్రమే జరిగే విధంగా చేసుకొంటున్నారు. ఈ ప్రక్రియలు పలువురు నాయకులను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.