కాకినాడ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తాతల కాలంనుంచి రౌడీలను పోషిస్తూ కోట్లకు కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక బియ్యం స్మగ్లింగ్ ద్వారా 15 వేల కోట్లరూపాయలు కాజేసినట్టుగా కూడా పవన్ కల్యాణ్ గణాంకాలు బయటపెట్టారు. స్థూలంగా చూసినప్పుడు.. రాబోయే ఎన్నికల్లో ద్వారంపూడిని కాకినాడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. ద్వారంపూడి మళ్లీ గెలిస్తే తన పేరు పవన్ కల్యాణే కాదని ఆయన ఆవేశంగా ప్రకటించారు.
..ఇంతవరకు పవన్ కల్యాణ్ కు సంబంధించిన సవాలు! దీనికి జవాబు ఎలా ఉండాలి? సరైన జవాబు గనుక.. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చెప్పదలచుకుంటే.. ‘‘నేను గెలిచి తీరుతా.. నీ పేరు మార్చుకుని కొత్తగా ఏం పేరు పెట్టుకోవాలో.. ఇప్పటినుంచే ఆలోచించుకో’’ అని ఎద్దేవా చేయాలి! కానీ ద్వారంపూడి అలా చేయలేదు. ఆయన ఇంకాస్త ఘాటుగా రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే వచ్చి కాకినాడ నియోజకవర్గంలో పోటీచేయాలని ఆయన సవాలు విసిరారు.
ఈ సవాలులో మజా ఏం ఉన్నదో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున గానీ, తెలుగుదేశం తరఫున గానీ.. కాకినాడ అర్బన్ లో ఏ అభ్యర్థి ఉన్నా సరే.. అతడి ద్వారానే ద్వారంపూడిని చిత్తుగా ఓడిస్తానని ప్రతిజ్ఞ చేస్తోంటే.. నా మనిషిని పెట్టి ఓడిస్తా అంటోంటే, నువ్వే వచ్చి పోటీచేయి అని అర్థంలేని లింకు పెట్టడమే కాకుండా… దానికి ‘దమ్ముంటే’ అని జోడించడం చాలా కామెడీగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ , చంద్రబాబునాయుడు లాంటి నాయకులను రోజుకొక వైసీపీ ఎమ్మెల్యే తొడకొట్టి పిలుస్తుంటారు. దమ్ముంటే నా నియోజకవర్గంలో వచ్చి పోటీచేయి.. నా మీద గెలిచి చూపించు.. లాంటి పడికట్టు మాటలు అలవోకగా వచ్చేస్తుంటాయి. సవాళ్లు విసిరిన వారందరి నియోజకవర్గాలకు వెళ్లిపోటీ చేయాలంటే.. ఈ నాయకులు కనీసం నలభై- యాభై నియోజకవర్గాల్లో పోటీచేయాలి. అయినా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారి పార్టీ అభ్యర్థులు వారికంటె తక్కువే కదా.. వారినే దింపి ఓడిస్తాం అంటున్నప్పుడు ఈ సవాళ్లలో అర్థం లేదు కదా అనేది. ద్వారంపూడి కూడా.. తన మీద పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. అవినీతి గురించి నిరూపించడం అని అంటున్నారే తప్ప.. జనసేన మహిళా కార్యకర్తలపై చేయించిన దాడుల గురించి నోరెత్తడం లేదు. ఇలా ఇప్పటికే ఆత్మరక్షణ లో పడిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు రానురాను ఇంకాస్త విమర్శల జోరు పెంచితే ఎలా తట్టుకుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.