నిన్నమొన్నటిదాకా పవన్ కల్యాణ్ వెంట నడుస్తూ ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరుగా చెలామణీ అయిన వ్యక్తి.. హఠాత్తుగా పార్టీ మారారు. ఇప్పుడిప్పుడే మంచి ఊపు మీదకు వస్తున్న జనసేనను వదలిపెట్టి.. ఏపీలో భవిష్యత్తు కాదు కదా.. వర్తమానం ఎలా ఉంటుందో కూడా తెలియని భారత రాష్ట్రసమితిలో చేరారు. చేరికకు ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకోవచ్చు. కానీ.. రాజకీయంగా అడుగులు వేయడంలో పవన్ కల్యాణ్ మీద కక్ష కట్టినట్టుగా వెళుతున్నారా? అనే అభిప్రాయం కలిగించడమే ఆశ్చర్యకరంగా ఉంది. జనసేనను వదలిపెట్టి భారతరాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తోట చంద్రశేఖర్ జనసేనను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.
పవన్ కల్యాణ్ కు కాపు సామాజికవర్గం మద్దతు పుష్కలంగా ఉంటుంది. ఇతర పార్టీల్లో ఉన్న కాపు నాయకులకు వ్యక్తిగతంగా, లోకల్‌గా ఉండే బలం కొద్దీ కాపులు సమర్థించాల్సిందే తప్ప.. కులం పరంగా చూసినప్పుడు.. కాపుల మెజారిటీ మద్దతు పవన్ కల్యాణ్ కే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడు చేయడం ద్వారా.. కేసీఆర్ .. జనసేనానిని టార్గెట్ చేశారేమో అని కొందరికి అనిపించింది.
ఇప్పుడు ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో.. ఏపీనుంచి కూడా జనాన్ని సమీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారాస తరఫున ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ, ఖమ్మం సభకు జనాన్ని పిలుస్తూ తోట చంద్రశేఖర్ పేరుతోనే ఫ్లెక్సిలు వెలిశాయి. అయితే గుంటూరు, విజయవాడ వంటి కామన్ ప్రాంతాల్లో మినహాయిస్తే.. ఉభయ గోదావరి జిల్లాలు పవన్ కల్యాణ్ కు బాగా బలం ఉంటుందని అనుకుంటున్న ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సిలు ఎక్కువగా వేయడం గమనార్హం.
అసలు జనసేననుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన తోట చంద్రశేఖర్ కు ఎందుకు వచ్చిందో గానీ.. ఇప్పుడు భారాస రాష్ట్ర అధ్యక్షుడిగా జనసేనను దెబ్బతీయడానికే ఆయన తన సర్వశక్తులను ఒడ్డడానికి సిద్ధపడుతున్నారా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. నిజానికి జనసేననుంచి మరికొంత మంది నాయకులను భారాసలో చేర్పించడానికి కూడా తోట చంద్రశేఖర్ వ్యూహరచనలో ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపు సామాజికవర్గం అనేది.. రాష్ట్రంలో బలమైన సామాజికవర్గమే అనడంలో సందేహం లేదు. కానీ.. ఆ వర్గం నాయకుడే జనసేనను నడుపుతుండగా.. భాజపా, భారాస రెండూ కూడా ఆ వర్గం నుంచి రాష్ట్ర సారథులను ఎంపికచేసి అడుగులు వేస్తుండడమే తమాషా.
పవన్ మీద తోట కక్షకట్టారా?
Saturday, November 16, 2024