పవన్ బదులు పురందేశ్వరిని టార్గెట్ చేస్తున్న వైసీపీ

Saturday, October 5, 2024

టిడిపి నేతలకన్నా బలంగా, ప్రజలలోకి చొచ్చుకుపోయి విధంగా తమ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుండటంతో వైసీపీ నేతలు సహించలేక వ్యక్తిగత దాడులకు దిగుతూ వస్తున్నారు. పవన్ లేవనెత్తిన అంశాలకు తగు సమాధానం చెప్పలేక, ఆయన వివాహాల గురించి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు `దత్త పుత్రుడు’ అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ వచ్చారు.

స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవికున్న హోదాను సహితం పట్టించుకోకుండా వ్యక్తిగత దాడులకు దిగుతూ ఉండడంతో ఎంతగా అసహనంకు లోనవుతున్నారో వెల్లడి అవుతుంది. తాజాగా రాష్త్ర బిజెపి అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి సహితం వచ్చి రాగానే వైసిపి ప్రభుత్వంను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు.

ఓ రెండు వారాల పాటు ఆమె విమర్శలను పట్టించుకోలేదు. వైసిపి నేతలు ఎవ్వరూ స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులకు దిగే సంస్కృతిని ఏపీలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి మొదటగా ఆమెపై విమర్శలు ప్రారంభించారు. ఆమె టిడిపి అధినేత చంద్రబాబు వకాల్తా పుచ్చుకొంటున్నట్లుగా ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు.

తాజాగా అయితే `భారతీయ జనతా పార్టీ’ అంటే `భారతీయ చంద్రబాబు పార్టీ’ కాదమ్మా అంటూ చిన్నమ్మను దుమ్మెత్తిపోశారు. తమ మరిది అయినా చంద్రబాబు పాలనలో తప్పిదాలను ప్రస్తావించకుండా వైసిపి తప్పిదాలనే ప్రస్తావించడంలో ఉద్దేశ్యం ఏమిటంటూ ప్రశ్నలు కురిపించారు. ఆయన నుండి క్లూ తీసుకున్న ఇతర నేతలు సహితం వరుసగా ఆమెను లక్ష్యంగా చేసుకొని విమర్శలు ప్రారంభించారు.

ముందుగా ఆమె పని పట్టాలి అనుకున్నారో, ఏమో తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలకు విరామం ఇచ్చినట్లున్నారు. ఇక మంత్రి రోజా మరింత ఘాటుగా పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అనే సందేహం వస్తోందని విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడితే పురందేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. 

జనసేన, బిజెపి వంటి పార్టీలు తమపై విమర్శలు కురిపిస్తే అవన్నీ టిడిపి స్క్రిట్ అంటూ ఎద్దేవా చేయడం వైసిపి నేతలకు పరిపాటిగా మారింది. అంటే ప్రపంచంలోనే ఓ పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బిజెపి నేతలకు సొంతంగా స్క్రిప్ట్ తయారు చేసుకోలేరను కొంటున్నారా? కొద్దీ వారల క్రితం ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా  వైసిపి పాలనపై చేసిన విమర్శలనే కదా ఆమె వివరిస్తున్నారు? వారిని కూడా టిడిపి నడిపిస్తుందని అనుకొంటున్నారా?

ఏపీని జగన్ అప్పులమయంగా మార్చేస్తున్నారని విమర్శిస్తే కేవలం ఏపీ మాత్రమే అప్పులు చేస్తుందా? అంటూ రోజా ఎదురు ప్రశ్న వేశారు. కానీ పురందేశ్వరి ఇచ్చిన గణాంకాలు తప్పని చెప్పే ధైర్యం చేయడం లేదు. వ్యక్తిగత విమర్శలకు దిగి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతకు ముందున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొహమాటంకోసం వైసీపీపై రెండు మాటలు అన్నా ఎక్కువగా చంద్రబాబు లక్ష్యంగా విమర్శిస్తుండేవారు. అందుకనే ఆయన బృందం వైసిపి అదుపాజ్ఞలలో నడుస్తుందనే ఆరోపణలు రావడంతోనే రాష్త్ర అధ్యక్షుని మార్చాల్సి వచ్చింది. సోము వీర్రాజు మాదిరిగా పురందేశ్వరి తమ చెప్పుచేతలలో ఉందేరకం కాదని అసహనం వైసిపి నేతలను ఆవహిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles