కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ జాతీయ రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏపీలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం పట్ల కాకుండా, అధికారంలో ఉన్న పార్టీతో కుమ్మక్కై, ఆ పార్టీ మనుగడకోసం అవిశ్రాంతంగా పట్టుబడుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మైండ్ ఇప్పుడు బ్లాక్ ఆయిన సూచనలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో ఆయన ఖంగుతిన్నట్లు స్పష్టం అవుతున్నది. పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో చేతులు కలపకుండా ఇప్పటివరకు చేయవలసింది అంతా చేశారు.
చివరకు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా పవన్ కలిసేటట్లు చూసే, చంద్రబాబుకు దూరంగా ఉండమని `హితబోధ’ కూడా చేయించారు. వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని పవన్ కొంతకాలంగా చెబుతున్నా వచ్చే ఎన్నికలలో బిజెపి, జనసేన కలిసి మాత్రమే పోటీ చేస్తాయని, తాము అధికారంలోకి రాబోతున్నామని అంటూ వీర్రాజు ప్రగల్భాలు పలుకుతూ వస్తున్నారు.
అయితే పవన్ పొత్తులతో తాజాగా చేసిన వాఖ్యలతో ఆ మాటలు కొత్తగా ఉన్నాయని అంటూ `వెర్రిముఖం’ పెట్టారు. ఆయన వ్యాఖ్యల్లో మరింత స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని అంటూ ఏదో వేదాంతం మాట్లాడారు. ఏదేమైనా, పవన్ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని మాత్రం ఒప్పుకున్నారు. పవన్ తీసుకోబోయే రాజకీయ నిర్ణయం వచ్చే ఏపీ ఎన్నికలలో నిర్ణయాత్మకం కానున్నాయని ఒప్పుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎక్కడ ఉంటుంది అన్నదే ప్రశ్న. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహఁడికారాన్ని కాపాడటం కోసం `శిఖండి’ పాత్ర పోషిస్తూ గతంలో నోటా కన్నా తక్కువగా వచ్చిన ఓట్లను కూడా పోగొట్టుకుంటారా? బిజెపి వ్యతిరేక కూటమిలో చేరి గౌరవప్రదమైన సీట్లు పొందుతారా? అన్నది తేల్చుకోవాల్సింది బిజెపి అధినాయకత్వమే.
పవన్ తన రాజకీయ వైఖరి స్పష్టం చేయడంతో ఇప్పుడు ఇక పార్టీల కత్తులు పదునెక్కుతాయని, త్వరలోనే ఏపీ రాజకీయాల్లో పరిణామాలు మారిపోతాయని సోము వీర్రాజు చెప్పారు. ఇలా ఉండగా, తాను టిడిపితో పొత్తు పెట్టుకోవడమే కాకుండా టీడీపీతో పొత్తుకు బీజేపీని కూడా ఒప్పిస్తానంటూ పవన్ చెబుతున్నారు. అంటే బిజెపి జాతీయ నాయకత్వం వద్దనే తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. దీని వెనుక అర్థం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశముందనే సంకేతాలు ఇవ్వడమే. అయితే ఈ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం సహితం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకనే సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి `వైసిపి ఏజెంట్లు’ బిజెపిని టీడీపీకి దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే టిడిపితో చేతులు కలపనిదే ఏపీలో బీజేపీ మనుగడ ప్రశ్నార్ధకం కాగలదని రాష్ట్ర బీజేపీలో బలమైన వర్గాలు ఇప్పటికే కేంద్ర నాయకత్వం వద్ద స్పష్టం చేశాయి.