జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంపై అందరికన్నా ఎక్కువగా ఏపీ బిజెపి నాయకత్వం షాక్ కు గురైనట్లు కనిపిస్తున్నది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కలిసేటట్లు చేయడంతో ఇక చంద్రబాబుకు దూరం చేశామని సంబరపడుతున్న బిజెపి నాయకులకు ఈ భేటీ మింగుడు పడటం లేదు.
ఈ సందర్భంగా ఏపీలో బిజెపి రోడ్ మ్యాప్ ఏమిటో ప్రధాని తెలియ చెప్పారని, దానితో పవన్ సంతృప్తి చెందారని, ఇక చంద్రబాబు వద్దకు వెళ్లే ప్రశ్నలేదని బిజెపి నేతలు కొందరు ప్రచారం చేశారు. అందుకు తగ్గట్లు ఈ భేటీ తరువాత జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పలు సభల్లో చెప్పడంతో.. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారని కూడా భరోసా వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఒక వంక చంద్రబాబు, పవన్ లను కలవకుండా చేయాలని నిత్యం అగ్గిపెట్టె ప్రయత్నం వైసిపి నాయకులు చేస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు సహితం అదే విధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ ధోరణిపై రాష్ట్ర బీజేపీలో తిరుగుబాటుకు పలువురు సీనియర్ నాయకులు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
ఇటీవల ఏకపక్షంగా కొన్ని జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు మార్చడం పట్ల మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కన్నెర్ర చేశారు. ఒకొక్కరిని పార్టీ నుండి బైటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కన్నా ఆరోపణలపై బిజెపి నేతలు ఎవ్వరు మాట్లాడక పోవడం గమనార్హం.
సోము వీర్రాజు బృందం రాష్ట్రంలో నోటాతో పాటు కూడా ఓట్లు లేకుండా బిజెపి ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్నా జగన్ మరోసారి సీఎం కావాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. జాతీయ నాయకత్వం సహితం ఈ విషయంలో పట్టించుకోక పోవడంతో పెద్ద ఎత్తున బీజేపీ నుండి వలసలు ఉంటాయని స్పష్టం అవుతుంది.
మాజీ ఎంపీ టిజి వెంకటేష్ సహితం పవన్- చంద్రబాబు భేటీపై వైసీపీ విమర్శలను ఎద్దేవా చేశారు. పవన్‌కు ఒక్క సీటు రాదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. అదే ఒక్క సీటు రాని పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలిస్తేనేమో.. వైసీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.వెంకటేష్ బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడు కర్నూల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉండటం గమనార్హం.
చంద్రబాబుతో పొత్తు ప్రసక్తి లేదని, పవన్ కళ్యాణ్ తోనే పొట్టని, తామిద్దరమే కలసి పోటీ చేస్తామని నిత్యం ప్రకటనలు ఇస్తుంటే సోము వీర్రాజు ప్రస్తుతం ఈ విషయమై మౌనం వహిస్తున్నారు. బిజెపితో కన్నా టిడిపితో పొత్తుకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమైంది. జనసేన, టీడీపీలతో బీజేపీ చేతులు కలపని పక్షంలో ఆ రెండింటిలో ఏదో ఒక పార్టీలో చేరి, ఆయా పార్టీల అభ్యర్థులుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి పలువురు ముఖ్యమైన బిజెపి నేతలు సిద్ధంగా ఉన్నారు.
అందుకనే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఏపీలో రాజకీయంగా బిజెపి ఉనికినే ప్రశ్నార్ధకంగా చేసే అవకాశం ఉంది. మరోవంక, బిజెపి లేని పక్షంలో వారిద్దరితో చేతులు కలపడానికి వామపక్షాలు సహితం సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు అఖిల పక్ష సమావేశాలలో, రౌండ్ టేబుల్ సమావేశాలలో జనసేన, టిడిపిలతో వామపక్ష నాయకులు సహితం వేదికలు పంచుకొంటున్నారు. రాజకీయంగా రాష్ట్రంలో బిజెపి ఒంటరిగా మిగిలి పోయినట్లయింది.