వారాహి విజయయాత్ర రెండో దశను సోమవారం ఏలూరు నుండి ప్రారంభిస్తూ రాష్ట్రంలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.వలంటీర్ల సంఘాలు క్షమాపణ కోరుతూ రాష్త్ర వ్యాప్తంగా నిరసనలు జరపడం, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం చేస్తున్నారు.
మరోవంక, మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని అంటూ చేసిన వాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమీషన్ ఈ వాఖ్యాలను సీరియస్ గా తీసుకుంది. ఈ వాఖ్యలపై వివరణ, ఆధారాలను పది రోజుల లోగా ఇవ్వాలని ఆదేశిస్తూ పవన్ కళ్యాణ్ కు నోటీసు జారీ చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడలో విమర్శించారు వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా? అని ఆమె ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని పద్మ డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా? అని ఆమె నిలదీశారు. తాము ఇచ్చిన నోటీస్ లకు సరైన సమాధానం పవన్ నుంచి రానట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనుక వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఉన్నారని, వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘‘వైఎస్‌ఆర్‌సిపి పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవంక, తిరుగుబోతు సంసారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడితే అలాగే ఉందని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం పవన్, చంద్రబాబుకు ఉందా? అంటూ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు.
పవన్ నిరాశ, ఆవేదన బాధతో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలేనా? అవి అని గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్లనాని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై, సమస్యలపై పవన్‌కు కనీస అవగాహన లేదని ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో క్రిమినల్ కేసులు పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ప్రభుత్వ అనుమతి కోరుతూ విజ్ఞప్తి చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. వాలంటీర్ వ్యవస్థను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై అయా శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.