గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా ఉపయోగించుకున్న `గాజు గ్లాస్’ ఈ పర్యాయం ఏమేరకు అందుబాటులోకి వస్తుందో ప్రశ్నార్థకంగా మారింది. ఈ సారి ఎన్నికల కమీషన్ ఆ గుర్తును జనరల్ గుర్తుల జాబితాలో చేర్చడంతో ఎవరైనా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. జనసేన కోరినా దానినే ఏమేరకు రిజర్వ్ చేస్తారో చూడాల్సి ఉంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు సమస్యగా మారే అవకాశం ఉంది. జనసేన తన పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఈ సమస్య తలెత్తుతుంది.
దీంతో ఇప్పుడా గుర్తు తమకు దక్కుతుందో, లేదోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొన్నది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతాన్ని పొందవలసి ఉంటుంది. జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం వంటి కారణాల వల్లే పార్టీ సింబల్‌ను కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది.
గతంలో ఏపీలోని బద్వేలు ఉప ఎన్నిక, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును ఈసీ వేరే పార్టీ అభ్యర్థులకు కేటాయించింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఆ పార్టీ తన గుర్తును కోల్పోయింది. ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణాలో పోటీ చేస్తామని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినా, ఆ దిశలో చెప్పుకోదగిన సన్నాహాలు కనిపించడం లేదు.
నామమాత్రంగా పోటీచేసి, తగు ఓట్లు రాని పక్షంలో తిరిగి తీసుకున్న గుర్తు ఆ పార్టీకే ఉండే అవకాశం ఉండదు. అప్పుడు మరో నాలుగు నెలల తర్వాత జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో మరో గుర్తు తీసుకుంటారా? రెండు రాష్ట్రాల్లో ఒకే గుర్తు ఉండే ప్రయత్నాలు చేస్తారా? లేదా తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటారా? చూడాల్సి ఉంది.
ఏదేమైనా తెలంగాణ ఎన్నికల పట్ల పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపుతున్న దాఖలాలు లేవు. ఏపీలో మమిత్రపక్షంగా భావిస్తున్న బిజెపి నేతలు తెలంగాణాలో మాత్రం జనసేనతో తమకు పొత్తులేదని స్పష్టం చేస్తున్నారు. దానితో తెలంగాణాలో ఒంటరిగా పోటీచేస్తారా? కోదండరాం వంటి కొత్త పొత్తులకు ప్రయత్నం చేస్తారా? పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో తెలియవలసి ఉంది.