ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో సుమారు నాలుగేళ్లుగా పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శ్రేణులతో కలసి అడుగు వేయలేక పోతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతుంటే, రాష్ట్రంలోని అనేకమంది బిజెపి నేతలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయోజనాలు కాపాడేందుకు తాపత్రయ పడుతున్నట్లు పలు సందర్భాలలో స్పష్టం అవుతుంది.
అంతేకాకూండా, కోర్టు కేసులలో, ఇతరత్రా ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం అండగా ఉంటూ వస్తున్నది. 2024 ఎన్నికలలో వైఎస్ జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకు టిడిపి, జనసేన, బిజెపి కలసి పోరాడాలని చాలాకాలంగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. అందుకు టిడిపి నుండి సుముఖత వ్యక్తం అవుతున్నా బీజేపీ నాయకత్వం మాత్రం విముఖంగా ఉంటున్నది.
మరో ఏడాదిలో ఎన్నికలు ఉండటం, ముందస్తు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయనడంతో ఈ విషయమై బిజెపి అధిష్టానం వైఖరి ఏమిటో తేల్చుకోవాలని పవన్ కళ్యాణ్, సహచర నేత నాదెండ్ల మనోహర్ తో కలసి ఢిల్లీ వెళ్లి మూడు రోజులపాటు మకాం వేశారు. సీఎం జగన్ అర్ధాంతరంగా వెళ్లినా ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కలిసే సౌలభ్యం ఉంటుండగా, మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ ను ఆమేరకు విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ఆయన పర్యటన జరిగిన తీరు స్పష్టం చేస్తున్నది.
కేవలం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ తో మాత్రం రెండు సార్లుగా భేటీ అయ్యారు. రెండు రోజులకు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో జరిగిన భేటీ సహితం మొక్కుబడిగా జరిగిన్నట్లు కనిపిస్తున్నది. ఈ భేటీలలో ముందుగా క్షేత్రస్థాయిలో పార్టీలను పటిష్టం చేసుకుందామని పడిగట్టు పదాలు మినహా బీజేపీ నాయకుల నుండి ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన్నట్లు కనబడటం లేదు.
రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం పవన్ చేసినా వారి నుండి ఆశించినరీతిలో స్పందన వచ్చినట్లు లేదు. `వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్’ లక్ష్యంగా పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పడమే గాని, బిజెపి నేతల నుండి ఈ విషయంలో స్పష్టమైన ప్రకటనలు రాకపోవడం గమనార్హం.
దేశంలో సొంత పార్టీలో గాని, ఇతర రాజకీయ పార్టీలలో గాని రాష్ట్ర స్థాయిలో కూడా బలమైన నేతలు ఎవ్వరూ ఉండరాదని ప్రధాని మోదీ, అమిత్ షా కోరుకొంటున్నారు. అందుకనే వారిద్దరూ చంద్రబాబు నాయుడు వంటి బలమైన నాయకుడు తిరిగి అధికారంలోకి రావడం పట్ల సుముఖంగా లేరని వారి ధోరణిని బట్టి స్పష్టం అవుతుంది.
రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరిగిందని ఆ పార్టీ చెబుతున్నా, బీజేపీ-టీడీపీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఏపీలో వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడం, అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు జరిగినట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వంతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న అంశాలపై కప్పదాటు వైఖరినే బీజేపీ నేతలు ప్రదర్శిస్తున్నారు. పైగా, ఆయన ఢిల్లీలో కలసిన మురళీధరన్ గాని, జెపి నడ్డా గాని ప్రస్తుతం బీజేపీలో ఉత్సవ విగ్రహాలే. విధానపర నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గలవారు కాదు. అటువంటి సామర్థ్యం గల మోదీ, అమిత్ షా – ఇద్దరూ పవన్ కళ్యాణ్ కు మొఖం చాటేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికల అనంతరం ఏపీలో కొందరు బీజేపీ నేతలే ప్రజలు `వైసిపి- బీజేపీలను ఒకటిగానే చూస్తున్నారు’ అంటూ ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టు కొందరు కీలక బీజేపీ బిజెపి నాయకులు ఏపీలో వైసిపి ఏజెంట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలను పవన్ బిజెపి నేతల దృష్టికి తీసుకు వచ్చినా వారి నుండి స్పష్టమైన సమాధానం గానీ, హామీ గాని వచ్చినట్లు కనబడటం లేదు.
ఏపీలో బిజెపికి నోటాకన్నా తక్కవుగా ఓట్లు ఉన్నాయని స్పష్టం అవుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకనే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోలేక పోతున్నారు. వ్యూహాత్మకంగా, ఆయన టిడిపితో చేతులు కలపకుండా అడ్డుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్ కు మేలు చేకూర్చాలని బిజెపి పెద్దలు సహితం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇక తన రాజకీయ భవిష్యత్ గురించి పవన్ సొంత నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైనది చెప్పవచ్చు.