ప్రజాకంటకంగా మారిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన నుండి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించడం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడాలని కృతనిశ్చయంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీచేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన రాగానే వైసీపీ నేతలలో కలకలం చెలరేగింది.
రాజకీయంగా పోరాడలేమని గ్రహించి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎట్లాగైనా అటువంటి కూటమి ఏర్పడకుండా అడ్డుకోవాలని రెచ్చగోట ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలవకుండా తమను ఆదుకొమని బిజెపి అధినేతల సహకారం కోరినట్లు స్పష్టం అవుతుంది.
అందుకనే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగప్రవేశం చేసి పొత్తుల విషయంలో తొందరపడవద్దని పవన్ కళ్యాణ్ ను సున్నితంగా వారించారు. ఇప్పటివరకు జనసేనతో కలసి ఏపీ బీజేపీ రాజకీయంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పొత్తుల గురించి ప్రాధమికంగా చర్చలు కూడా జరపలేదు. ఉమ్మడిగా ఎటువంటి పోరాటాలకు సిద్ధపడలేదు.
అయితే జనసేన – బీజేపీ కలిసి వైఎస్ జగన్ ను ఓడించబోతున్నామంటూ సోము వీర్రాజు వంటి వారు చెబుతూ పరోక్షంగా జగన్ ను ఇబ్బందులు రాకుండా చూస్తామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్యెల్సీ ఎన్నికలలో జనసేన తమ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు బిజెపి నేతలు చెప్పడమే గాని, జనసేన నేతలు ఎక్కడా ఆ మాట తినకపోవడం గమనార్హం. కనీసం బిజెపి అభ్యర్థుల ప్రచారంలో కూడా కనిపించడం లేదు.
అయితే, పొరుగున ఉన్న తెలంగాణాలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామంటూ జనసేనతో ఇక్కడ పొత్తు ప్రసక్తి లేదనే సంకేతం తెలంగాణ బీజేపీ నేతలు ఇస్తున్నారు. పైగా, కేసీఆర్ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూల ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఆయనతో పొత్తేమిటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరి, ఏపీలో చంద్రబాబు నాయుడు పట్ల కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నా బిజెపి నేతలు పట్టించుకోవడం లేదు.
ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోన్న జనసేన ఏపీ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలపై మౌనం వహిస్తుండటం గమనార్హం. తాజాగా కేసీఆర్ వెయ్యికోట్ల రూపాయలకు పవన్ ను కొనుగోలు చేయబోతున్నారంటూ కధనాలు వ్యాపింపచేసినా వాటిని పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోలేదు.
జగన్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని, అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని, త్యాగాలు చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయడమే లక్ష్యమని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రెండుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.
బిజెపి ఎత్తుగడలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయ విధానంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చ్ 14న మచిలీపట్నంలో భారీ బహిరంగసభ నిర్వహించడం ద్వారా స్పష్టమైన రాజకీయ సందేశం వ్యక్తం చేసే అవకాశం ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు.
పైగా, పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనం వారాహిలో బందరులో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు రానున్నారు. ఇప్పటివరకు కేవలం వారాహిని పూజల కోసం మాత్రమే బయటికి తీసిన పవన్ కళ్యాణ్.. తొలిసారి రాజకీయ కార్యక్రమానికి వారాహిని వాడబోతున్నారు. ఏప్రిల్ నుంచి వారాహిలో రాష్ట్రమంతా తిరగాలని భావిస్తున్న పవన్ దీనికి టీజర్ గా బందరు సభకు తీసుకురానున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడా పవన్ భారీ బహిరంగసభ నిర్వహించక పోవడం గమనార్హం.