ఏపీలో వాలంటీర్ల అంశం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నది. వాలంటీర్లలో కొంతమంది అన్యాయాలకు పాల్పడుతున్నారని, ఒంటరి మహిళలను బెదిరించి లొంగదీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో కలిసి వైస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు.
విజయవాడ సచివాలయంలో పనిచేస్తున్న దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పవన్‌పై సెక్షన్ 153, 153ఏ, 505 (2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేయడం పట్ల జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ చెప్పింది ఒకటైతే..వైస్సార్సీపీ శ్రేణులు ప్రచారం చేస్తుంది మరోటి అని, వాలంటీర్లలో కొంతమందిని మాత్రమే పవన్ అన్నాడని, కానీ అది వారు అర్ధం చేసుకోకుండా వైస్సార్సీపీ నేతలు ఎంచెపితే అది చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.
విజయవాడలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో జనసైనికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాజకీయ దుర్బుద్ధితోనే పవన్ కళ్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
నగర పోలీస్ కమిషనర్ దీనిపై వెంటనే స్పందించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మిస్సింగ్ కేసులపై తమ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పకుండా పిరికిపంద చర్యలా పోలీస్ కేసులను నమోదు చేశారని విమర్శించారు. ఈ నియంత పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆందోళన తీవ్రతరం చేస్తామని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.
మరోవంక, వలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ తన దాడిని కొనసాగిస్తున్నారు. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న తర్వాత వాలంటీర్ల అవసరమేంటని ప్రశ్నించారు. వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యమే అన్న పవన్ రాష్ట్రంలో తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉందని ధ్వజమెత్తారు. త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తామని స్పష్టం చేశారు. వాలంటీర్లు చివరిదశలో వైసీపీకి అనుకూలంగా మారిపోతారని స్పష్టం చేస్తూ మన హక్కుల్ని కాపాడుకోవడం ముఖ్యం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
“నేను ప్రధాని మోదీకి జగన్ గురించి ఏదో చెప్పేశానని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. జగన్ మన ఇలాకా పిల్లాడు. అల్లరి పిల్లాడు. గూండా పిల్లాడు. అతనిని నియంత్రించడం జనసేనకు తెలుసు. అటువంటప్పుడు మోదీకి నేను ఎందుకు జగన్ గురించి చెబుతాను?” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ను జగ్గుభాయి అంటూ నిప్పులు చెరిగారు. అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని… అలాంటి వారితోనే మనం యుద్ధం చేయబోతున్నామని చెప్పారు.
“వాలంటీర్లు చాలా సూక్ష్మమైన వివరాలను సేకరిస్తున్నారు. 5వేల కోసం వారు చెబుతున్నారని ఇలాంటి పనులు చేయటం సరికాదు. ప్రభుత్వాలు మారితే డేటా సేకరణ విషయంలో వాలంటీర్లు బలవుతారు” అని హెచ్చరించారు. వాలంటీర్ల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని ఆయన కోరారు.
“వాలంటీర్ల రూపంలో ప్రతి ఇంటికి ఒక జగన్ ను పెట్టేశారు. వేలిముద్రలతో సహా ఇంట్లోని కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిగా తీసుకుంటున్నారు. వ్యక్తిగత డేటా విషయంలో 2019లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కానీ ఇలాంటి కీలక వివరాలన్నీ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని ఓ సంస్థకు ఇస్తున్నారు, జగ్గుభాయ్ కేవలం రాజకీయ నాయకులనే చూశాడు. నాలాంటి విప్లవకారుడిని చూడలేదు” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్వరంతో హెచ్చరించారు.