సుమారు వారం రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో జరుపుతున్న `వారాహి విజయ యాత్ర’కు ఎవ్వరి అంచనాలకు అందని రీతిలో, పెద్దగా సంస్థాగత బలం లేకపోయినా పెద్ద ఎత్తున జనం వస్తుండటం అధికార పార్టీ వైసీపీ నేతలలో ఆందోళన కలిగిస్తున్నది. మరోవంక, టిడిపి కార్యక్రమాలకు కూడా – అది లోకేష్ పాదయాత్ర అయినా, చంద్రబాబు నాయుడు పర్యటనలైనా పెద్దఎత్తున జనం వస్తున్నారు.
అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాలకు పాఠశాల విద్యార్థులు, వాలంటీర్లు, ఇతరులను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సమీకరింప వలసి వస్తున్నది. అంత కష్టపడినా తీరా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభమయ్యే సరికి పలుచోట్ల ఒక్కరొక్కరు లేచి వెళ్లిపోవడం కనిపిస్తున్నది. సాధారణ ప్రజానీకంలో వైసీపీ ప్రభుత్వం పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకత భావం కారణంగానే పవన్ యాత్రలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు స్పష్టం అవుతుంది.
రెండు గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీట్ కూడా దక్కనీయనని ఈ సందర్భంగా పవన్ పదే పదే స్పష్టం చేస్తుండటం వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టేటట్లు చేస్తున్నది. కాపు మంత్రులు, కాపు నేతలతో వరుసగా మీడియా సమావేశాలలో పవన్ కళ్యాణ్ ను తిట్టిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనం మధ్యకు వచ్చి పవన్ ను ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయలేక పోతున్నారు.
అందుకనే `బ్రహ్మాస్త్రం’గా కాపునేతగా పేరొందిన ముద్రగడ పద్మనాభంను ప్రయోగించినట్లు స్పష్టం అవుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ పేరుతో విడుదల చేసిన బహిరంగలేఖను చూస్తుంటే ఒక సామాజికవర్గం పెద్దగా, అభిమానంతో రాసినట్లు లేదు. వైసీపీ నేతగా అక్కసు వెళ్లగక్కిన నట్లుంది. కాపు సామాజిక వర్గంకు సంబంధించి తాను చెప్పినవి ఏవీ సీఎం జగన్ చేయలేదని అంటూనే ఆ పార్టీ వారిని వెనుకేసుకు రావడం విస్మయం కలిగిస్తుంది.
పైగా, ఈ లేఖలో `ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్’ అని సంబోధించడంలోనే ముద్రగడ కుటిల నీతి వెల్లడవుతోంది జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడిగా కాకుండా, ఒక పార్టీ అధ్యక్షునిగా యాత్ర చేస్తుంటే, ఆయన ప్రాముఖ్యతను ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించే దుష్ట యత్నంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు ఆ లేఖ వెల్లడిచేస్తుండనే విమర్శలు చెలరేగుతున్నాయి.
పవన్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పట్ల వాడిన భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన పవన్ గతంలో అదే ఎమ్యెల్యే జనసేన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, ఆయన నేతృత్వంలో దౌర్జన్యాలు మితిమీరి జరుగుతున్నా ఎప్పుడైనా నోరు మెదిపారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా, తాను ఒక కులం కోసం, కుల నాయకుడిగా రాజకీయాలు చేయడం లేదని, అన్ని అణగారిన వర్గాల వాణి వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నానని పవన్ పలుసార్లు స్పష్టం చేశారు. అటువంటి పవన్ ను కుల నేతగా అవతారం ఎత్తమని ముద్రగడ సూచించడం అపహాస్యం చేసినట్లు అవుతుంది.
“రూ.కోట్ల సూట్‍కేసులకు అమ్ముడుపోవడానికి ఉద్యమం చేయలేదని” తన లేఖలో ప్రస్తావించడం ద్వారా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను `ప్యాకేజి మనిషి’ అంటూ సీఎం జగన్ నుండి వైసిపి నేతలు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చే ప్రయత్నంగానే కనిపిస్తుంది. పైగా, పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్యెల్యేపై ఆగ్రవేశాలు వ్యక్తం చేయడానికి కారణమైన గత సంఘటనలను గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేయకుండా ఆ కుటుంబంతో తనకు గల బాంధవ్యాన్ని ప్రస్తావించడం ద్వారా ముద్రగడ ఉద్దేశ్యం ఏమిటో అర్థంకాని పరిస్థితి ఉంది.
ఏదిఏమైతే పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రయోగించిన అస్త్రంగానే ముద్రగడ తాజా లేఖను జనసైనికులు చూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నాను అంటూనే వచ్చే ఎన్నికలలో తనకో లేదా తన కుమారుడికో సీట్ కోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు స్పష్టం అవుతుంది.