ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి, సాక్షి పత్రికపై క్రిమినల్ కేసులు దాఖలు చేసిన మంగళగిరి కోర్టుకు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. అందుకోసం తన యువగళం పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చారు.
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ అసత్య ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. తమ కుటుంబంపై చేసిన ఆరోపణలపై కోర్టులో వాంగ్మూలం ఇచ్చానని చెబుతూ న్యాయం జరిగేంతవరకూ ఓపికతో పోరాడుతామని స్పష్టం చేశారు. తమపై తప్పుడు రాతలు రాయాలంటే ఎవరైనా భయపడాలని పేర్కొంటూతప్పుడు రాతలు రాస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
‘జగన్మోహన్ రెడ్డిది జైలు లైఫ్ అయితే.. నాది కాలేజ్ లైఫ్.. నాకు క్లాస్‌మేట్స్ ఉంటే.. జగన్‌కు జైల్‌మేట్స్ ఉన్నారు’ అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సీఎం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆస్తులు వెల్లడించిన ఏకైక రాజకీయ కుటుంబం తమదని గుర్తు చేశారు.
జగన్‌రెడ్డిలా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను అక్రమాస్తులు సంపాదించలేదని, దొంగ పేపర్, టీవీ ఛానెల్, పవర్ ప్లాంట్ పెట్టలేదని ఆరోపణలు సాధించారు. పేదల పట్ల సీఎం జగన్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని లోకేష్ విమర్శించారు. బురద జల్లి వెళ్లిపోతానంటే ఊరుకునేది లేదని, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
లోకేష్ వస్తుండటంతో కోర్టు దగ్గరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో కోర్టు వద్ద సందడి నెలకొంది. లోకేష్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు కూడా కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ లోకేష్ కోర్టు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
టీడీపీ హాయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని, నిధులు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేయగా పలువురిని అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది.
సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్‌తో పాటు చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగల్వార్, సురేష్ గోయల్, కన్విల్కర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయగా ఆ తర్వాత వారందరూ బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఈ స్కాం చోటుచేసుకోవడం, అప్పట్లో లోకేష్ ఐటి మంత్రిగా ఉండటంతో ఇందులో లోకేష్ హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.
వైసీపీ నాయకురాలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఫేక్ ప్రాపగాండాపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టును లోకేష్ ఆశ్రయించారు. అలాగే చినబాబు చిరు తిండి పేరుతో సాక్షి వేసిన కథనంపై మంగళగిరితో పాటు విశాఖ కోర్టులో మరో పరువు నష్టం దావా వేశారు. తాను తప్పు చేయనని, అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోనంటూ లోకేష్ గతంలో వైసీపీ నేతలను హెచ్చరించారు.