తండ్రి అకాలమరణం పాలయ్యారు. అన్న చెల్లెళ్లు ఇద్దరూ ప్రతి జయంతికీ, వర్ధంతికీ కలిసే తండ్రికి నివాళులు అర్పించేవాళ్లు. కలిసే ప్రార్ధనలు చేసేవాళ్లు. కాలక్రమంలో రోజులు మారాయి. అన్నచెల్లెళ్ల ఆత్మీయతానుబంధాల మధ్య అడ్డుగోడలు మొలిచాయి. ఆర్థిక వ్యవహారాలు ముళ్లకంచెగా ఏర్పడ్డాయి. విభేదాలు ముదిరి పూర్తిగా వేరుపడ్డారు. పలకరింపులు కూడా కరవయ్యాయి. కొన్నాళ్లుగా కనీసం తమ తండ్రి జయంత్రి, వర్ధంతి కార్యక్రమాల్లో తారసపడినా, పలకరించుకోకుండానే.. నివాళులు అర్పించి వెళ్లిపోయేంతటి వైషమ్యం ఏర్పడింది. తాజాగా అది ఏ స్థితికి చేరుకున్నదంటే.. అసలు ఇద్దరికీ తాము పరస్పరం తారసపడడం కూడా ఇష్టం లేదేమో అనిపించేంతగా వేర్వేరే టైమింగ్స్ లో నివాళి కార్యక్రమాలను షెడ్యూలు చేసుకున్నారు. శనివారం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద అన్నచెల్లెళ్లు జగన్- షర్మిల నివాళులు అర్పించిన వైనం గమనిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది.
అన్న జైలుకు వెళితే.. ఆయన తరఫున ఎండల్లో వానల్లో పాదయాత్రను కంటిన్యూ చేసినంతటి అనుబంధం వారి మధ్య ఉండేది. ఇప్పుడు పలకరింపులు ఏనాడో మరుగైపోయాయి.. కనీసం తారసపడడం కూడా లేకుండాపోయింది. రాఖీ వంటి పర్వదినాల్లో అన్నయ్యకు రక్షాబంధన్ కట్టి, ఆశీస్సులు తీసుకునే, అదివరకటి సంస్కృతి కూడా ఇప్పుడు వారికి నేరంగా కనిపిస్తోంది.
శనివారం నాడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, తన తల్లి ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఉదయమే ఇడుపులపాయకు వెళ్లి.. అక్కడ నివాళి అర్పించారు. ఆ కార్యక్రమం తర్వాత, ఆమె తన రాజకీయ కార్యక్షేత్రం తెలంగాణకు వెళ్లిపోయారు. ఖమ్మంలోని కరుణగిరి వద్ద కొత్తగా కడుతున్న తన క్యాంపు కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఆమె తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేసి, రాజకీయ లబ్ధిని చూసుకుంటారని ఒకవైపు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరునుంచి తాను ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని.. పాలేరు నుంచే తన పాదయాత్రను పునఃప్రారంభిస్తానని, తిరిగి పాలేరులోనే దానిని ముగిస్తానని షర్మిల ప్రకటించారు.
అదే సమయంలో.. జగన్ తన చెల్లెలు షర్మిల ఇడుపులపాయలో ఉండగా అటువైపు వెళ్లే అవసరమే లేకుండా కార్యక్రమాల షెడ్యూలు ప్లాన్ చేసుకున్నారు. ఉదయం అనంతపురం జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసాను బటన్ నొక్కి ప్రారంభించే కార్యక్రమం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లారు.
అప్పటికే షర్మిల తన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, తల్లి విజయమ్మతో కలిసి ఉదయం 8 గంటలకే సమాధివద్దకు వచ్చి తండ్రికి నివాళి అర్పించి వెళ్లిపోయారు. వైఎస్ విజయమ్మ మాత్రం కొడుకు జగన్ కూడా ఇడుపులపాయ వచ్చే వరకు ఆగి, కొడుకుతో కలిసి నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.