తెలంగాణాలో సంస్థాగతంగా బిజెపిని బ్రష్టు పట్టించినట్లు అపవాదులు ఎదుర్కొంటున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనను ఆ పదవి నుండి తొలగించేందుకు ఢిల్లీలో ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం కావడంతో పదవిని కాపాడుకోవడం కోసం చివరి ఎత్తుగడగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఆదివారం హైదరాబాద్ లో ఓ `రహస్య సమావేశం’ జరిపించారు.
ప్రధానంగా ఈటెలకు ప్రచార కమిటీ అధ్యక్ష పదవి ఇస్తున్నారని వస్తున్న కధనాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, తాము కూడా తెలంగాణ కోసం పోరాడామని, ఆయనకన్నా తమకు పార్టీలో సీనియర్లము అంటూ చెప్పుకొచ్చారు. ఈటెలకు ఎటువంటి పదవి ఇవ్వరాదంటూ పార్టీ అధిష్టానంకు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.
ఇతర పార్టీల నుండి చేరిన వలస నేతలతో జరిగిన ఈ సమావేశం సంజయ్ కు సన్నిహితుడిగా పేరొందిన మాజే ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో జరగడం గమనార్హం. మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి,బూర నర్సయ్య గౌడ్,రవీంద్ర నాయక్ లతో పాటు విఠల్, దేవయ్య పాల్గొన్నారు.
వీరిలో నలుగురు జాతీయ కార్యవర్గ సభ్యులు. తమను సంప్రదించకుండా ఢిల్లీలో తెలంగాణ పార్టీలో మార్పుల గురించిన కసరత్తు జరుగుతూ ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురిని సంజయ్ గత కొంతకాలంగా ప్రోత్సహిస్తూ ఈటెల వంటి వారిని కూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పాల్గొనకపోవడం గమనార్హం.
ఇప్పటివరకు రాష్త్ర అధ్యక్షుడిని మార్చే ఆలోచనలు ఏవీలేవని కొట్టిపారవేస్తూ వచ్చిన సంజయ్ మొదటిసారిగా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని నెరవేరుస్తా అంటూ కరీంనగర్ లో చెప్పడం గమనార్హం. ఏ పదవి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటాను అంటూ ఒకరకమైన నిర్వేదం వ్యక్తం చేశారు.
అయితే, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జితేందర్ రెడ్డి సంజయ్ ను మారుస్తున్నారని, ఈటెలకు పదవి ఇస్తున్నారని వస్తున్న కధనాలు అన్ని బీజేపీలో గందరగోళం సృష్టించేందుకు సిఎం కెసిఆర్ కొన్ని లీక్స్ వదులుతున్నారని ఆరోపించారు. పార్టీలో అయోమయం సృష్టించేందుకే కెసిఆర్ కుట్ర చేశారని ఆయన ధ్వజమెత్తారు.
కెసిఆర్ దృష్ఫ్రచారాన్ని తిప్పికొడుతామని చెబుతూ బిజెపిలో అసలు ప్రచార కమిటీ పదవి లేదని చెప్పుకొచ్చారు. బిజెపి కార్యకర్తల దృష్టి మరల్చేందుకే కెసిఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ లీక్స్ ను కార్యకర్తలు పట్టించుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
పైగా, రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోదని భరోసా వ్యక్తం చేశారు. అయితే, బిజెపి ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గత కొంత కాలంలో తెలంగాణాలో పార్టీ పరిస్థితి నుండి పలువురు నాయకులతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కేంద్రం తీసుకొనే నిర్ణయమాలకు ఆయన ఇచ్చిన నివేదికే ప్రాతిపదికగా భావిస్తున్నారు.
మరోవంక, స్వయంగా హోమ్ మంత్రి అమిత్ షా పలువురు తెలంగాణ నేతలతో ఇటీవల కాలంలో ఈ విషయమై సమాలోచనలు జరిపారు. ఎవ్వరితో చర్చించకుండా మార్పులు చేస్తున్నారని పేర్కొనడం సంజయ్ ఎత్తుగడలతో భాగంగా స్పష్టం అవుతుంది.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారని కెసిఆర్ ప్రచారం చేయిస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపణలు గుప్పించడం గమనార్హం. తెలంగాణ బిజెపిలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేస్తూ పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించామని తెలిపారు.