పడిపోతున్న సీఎం జగన్‌ గ్రాఫ్‌ తో వైసీపీ శ్రేణుల కలవరం

Sunday, December 22, 2024

గత ఎన్నికలలో 151 సీట్లనే గెల్చుకున్నామని, వచ్చే ఎన్నికలలో “వై నాట్ 175.. కుప్పంతో సహా” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ వేగంగా పడిపోతూ ఉండడంతో వైసిపి శ్రేణులు కలవరం చెందుతున్నారు. ముఖ్యంగా జగన్ చెబుతున్న `నవరత్నాలు’ భరోసాతో ప్రభుత్వం ఏపని చేయకపోయినా మీటర్ నొక్కుకొంటూ పోతూ ఉండడంతో వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలువబోతున్నామని ధీమాతో ఉంటూ వస్తున్న మంత్రులు, ఎమ్యెల్యేలు గాబరా పడుతున్నారు.

‘సంక్షేమంలో, అభివృద్ధిలో, పారదర్శక పాలనలో మేమే టాప్‌’ అంటూ నిత్యం ప్రచారం చేసుకొనే జగన్ మోహన్ రెడ్డి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమయింది. ముఖ్యమంత్రిగా ఆయన గ్రాఫ్ భారీగా పడిపోయిన్నట్లు ‘సీ ఓటర్‌ – ఇండియా టుడే’ సర్వే తాజాగా వెల్లడించింది.

ఈ సర్వేలో పేర్కొన్న పదిమంది ముఖ్యమంత్రులతో అందరికన్నా తక్కువగా ప్రజాదరణ గల ముఖ్యమంత్రిగా జగన్ తేలారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులకు వారి సొంత రాష్ట్రాల్లో ఉన్న ప్రజాదరణపై ఈ సర్వే జరిగింది. 2022 జనవరిలో జరిగిన సర్వేలో జగన్‌ పనితీరుపై 56.5శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో అది 17 శాతం తగ్గి… 39.7శాతానికి పడిపోయింది.

మంత్రులు, మాజీ మంత్రులకు సంబంధించిన 38 నియోజకవర్గాల్లో కేవలం ఏడుగురే మళ్లీ గెలుస్తారంటూ జగన్ అంతర్గతంగా జరిపిన ‘ఐప్యాక్‌’ సర్వే తేల్చిందని అంటూ కొద్దీ రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ కధనం చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు ఈ కధనాన్ని వైసిపి నేతలు ఎవ్వరు ఖండించక పోవడం గమనార్హం.

ఈ కధనం కారణంగా వైసిపి మంత్రులు, మాజీ మంత్రులలో కలవరం ఒకపక్క కొనసాగుతుండగానే జగన్‌కు ప్రజాదరణ భారీగా తగ్గిందంటూ ‘సీఓటర్‌- ఇండియా టుడే’ సర్వే బయటికి రావడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. ఈ జాబితాలో… రెండోస్థానంలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రజాదరణ ఇదే సమయంలో 58.9 శాతం నుంచి 69.2 శాతానికి పెరగడం గమనార్హం. 73.2శాతం ఓట్లతో ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

ఇదే సమయంలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన `యువగళం’ పాదయాత్రకు అనూహ్య ప్రజా స్పందన వస్తుండటం అధికార పక్షాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. 400 రోజుల పాటు 4,000 కిమీ దూరం ఆయన యాత్ర పూర్తయ్యేసరికి ఎన్నికలు వచ్చేస్తాయని,  ఈ లోగా ప్రజావ్యతిరేకత మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు.

ముఖ్యంగా 2019 ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల కోసం సొంత ఖర్చులు పెట్టుకొని, వళ్ళు విరుచుకొని పనిచేసినవారు ఇప్పుడు స్థబ్దతతో ఉండటం, తమ పార్టీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల పట్ల వారే పెదవి విరుస్తూ మాట్లాడుతూ ఉండడం వారిని మరింతగా ఆందోళన కలిగిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles