పంచాయితీల్లో రూ. 8660 కోట్లు కొల్లగొట్టిన జగన్ ప్రభుత్వం!

Tuesday, November 5, 2024

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సర్పంచ్ ల ప్రమేయం లేకుండా, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుండి నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతరత్రా ఖాతాలకు బదిలీ చేయించుకొని `సైబర్ నేరం’కు పాల్పడుతున్నట్లు సర్పంచులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ విషయమై కొంతకాలంగా పలు రూపాలలో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీల్లో దొంగలు పడ్డారని, తమకు తెలియకుండానే ఏపీ ప్రభుత్వం రూ. 8660 కోట్లు దొంగలించిందని ఆరోపిస్తూ సర్పంచులు పొలిసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. 
తమకు తెలియకుండానే తమ పంచాయతీ నిధులను అర్ధరాత్రి సమయంలో దొంగిలించిన ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి, తమ నిధులు తిరిగి వచ్చేలా చూడాలని  డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువాని మచిలీపట్నంలో కలిసిఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సారధ్యంలో సోమవారం ఫిర్యాదు అందజేశారు. అంతకుముందు రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2018 నుండి 2022 సంవత్సరం వరకు తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 8660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు, ఉచిత పథకాలకు దారి మళ్లించిందని ఆరోపించారు. దీని వల్ల గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని 12,918  గ్రామపంచాయతీలలో దొంగలు పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని తమ సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో ఉండవలసిన రూ. 8660 వాట్లను దొంగిలించి వేశారని, ఇది సైబర్ నేరం క్రిందకు వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంపై కేసు నమోదు చేసి, తగు చర్య తీసుకోవలసిందిగా తేల్చి చెప్పారు.

కాగా, ‘ఆగస్టు 15న పంచాయతీ కార్యాలయం చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌కు డబ్బుల్లేవమ్మా.. పల్లె సీమల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మొత్తం తీసేసుకుని గ్రామాల్ని ముంచేసిందమ్మా.. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి’ అంటూ రాష్ట్రంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరితో మొరపెట్టుకున్నారు. 

పంచాయతీల్లో మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు కూడా నిధుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ ఖాతాలో ఈ ఏడాది కేంద్రం ఇచ్చే పల్లె నిధులు జమ చేయించొద్దని కోరారు. స్పందించిన బీజేపీ అధ్యక్షురాలు కేంద్రం విడుదల చేసే నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.  కేంద్ర పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖ మంత్రులతో చర్చించి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచుల న్యాయమైన పోరాటానికి రాష్ట్ర బీజేపీ పూర్తి అండగా ఉంటుందని పురందేశ్వరి భరోసా ఇచ్చారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles