పంచాయతీ నిధులు ఏపీ సర్కారు చోరీ.. నిర్మలమ్మకు ఫిర్యాదు

Saturday, September 7, 2024

కేంద్రం మంజూరు చేసిన పంచాయితీ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్ళిస్తుందని ఆరోపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌,  కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ లకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఫిర్యాదు చేశారు.  రాష్ట్రంలో గ్రామ పంచాయితీలలో దొంగలు పడ్డారని, రూ.8660 కోట్లను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు ఇచ్చిన ఆర్దిక సంఘం నిధులు రూ.8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా, దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వాడుకుందని ఫిర్యాదు చేశారు. 2022-23 సంవత్సరానికి చెందిన 2010 కోట్లు, 2023 -24 సంవత్సరము కు చెందిన 2035 కోట్లు, మొత్తం రూ.4045 కోట్లను పంచాయితీలకు విడుదల చేయకపోవడంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం – 2006 క్రింద వచ్చే నిధులు నరేగా చట్టప్రకారం గ్రామ పంచాయితీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు సుమారు రూ. 35 వేల కోట్ల రూపాయలను తన సొంత అవసరాలకు, పథకాలకు వాడుకుంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘాల ద్వారా నిధులు పంపిస్తుందని, వాటిని దారి మళ్ళించడం రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి  ఇంతమంది సర్పంచులు వచ్చి  ఈ సమస్యను తన  దృష్టికి తీసుకువచ్చారు కనుక  తప్పకుండా వారి సమస్యలపై ఒక కమిటీ వేసి ఉన్నత స్థాయి విచారణ జరిపించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్  పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి. బి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావుల నేతృత్వంలో కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలు లాగా మార్చిన దుస్థితి గుర్చి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక,చట్ట వ్యతిరేక చర్యల గురించి కేంద్ర మంత్రులకు వివరించారు.

రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 12918 మంది గ్రామ సర్పంచులు కనీసం త్రాగునీరు కూడా అందించలేని స్థితిలో ఉన్నారని వివరించారు. ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం “జల జీవన్ మిషన్” పథకాన్ని కూడా మూలన పడేశారని ఆరోపించారు.

ఇకపై కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా మా గ్రామపంచాయతీ ” పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే జమ చేయాలని “, “రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన రూ.8660 కోట్ల నిధులపై సైబర్ క్రైమ్ కేసు కట్టి, సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. “గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను” రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీల్లో విలీనం చేయాలని, “నరేగా నిధులు కూడా నేరుగా మా గ్రామపంచాయతీలకే పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో జమ చేయాలని కోరారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles