నోరుజారి చిక్కుల్లో పడ్డ రాజోలు ఎమ్మెల్యే రాపాక

Thursday, December 19, 2024

2019 ఎన్నికల్లో  ఏపీలో జనసేన నుండి గెలుపొందిన ఏకైక అభ్యర్థి రాజోలు ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్‌ వరప్రసాద్. అయితే ఆయన మొదటి నుండి అధికార పక్షం వైసిపి ఎమ్యెల్యేగానే కొనసాగుతున్నారు. జనసేనతో సంబంధాలను తెంచుకోవడంతో జనసైనికులు ఆయన పట్ల ఆగ్రహంగా ఉంటూవస్తున్నారు.

తాజాగా, నోరుజారి మాట్లాడిన మాటలు ఆయన ఎన్నికపై ఎన్నికల కమీషన్ విచారణ చేపట్టేందుకు దారితీయడంతో ఆయనను చిక్కుల్లోకి నెట్టివేశాయి. మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

తమ సొంత గ్రామం చింతలమోరిని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఒక్కొక్కరు 5-10 ఓట్లు వేసేవారని.. అవే తన గెలుపునకు సహకరించేవని తన ఎన్నిక రహస్యాన్ని బయటపెట్టారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం జరిగింది. ఎమ్యెల్యే స్వయంగా తాను దొంగఓట్లతో గెలిచానని చెప్పుకోవడంతో ఆ ఎన్నిక ఏవిధంగా చెల్లుతుందని ప్రశ్న తలెత్తింది.  దానితో ఈ వీడియో ఎపిసోడ్‌పై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

వెంకటపతిరాజు గత నెల 24న ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా స్పందించారు. ఎన్నికపై విచారణ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను ఆదేశించడంతో ఎమ్యెల్యే రాపాక పాటుగా అధికార పక్షంగా కూడా ఆత్మరక్షణలో పడింది.

ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై వాస్తవానికి ఇదివరకే దుమారం రేగింది. చింతలమోరిలోని తన ఇంటి సమీపంలో ఉండే ఓ పోలింగ్ బూత్ గురించి ప్రస్తావించారు. సొంత ఊరిలో తనకు ఏడు నుంచి ఎనిమిది వందల వరకు మెజార్టీ వచ్చేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాపాక గతంలో చింతలమూరి గ్రామ సర్పంచ్‌గా పనిచేయడంతో ఈ వీడియోపై దుమారం రేగడంతో మాటమార్చి దిద్దుబాటు చర్యకు దిగారు.

కొందరు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెబుతూ గతంలో ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల విషయాన్ని తాను ప్రస్తావించినట్లు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తానేదో సరదాగా రెండు మాటలు అంటే అంత సీరియస్ గా తీసుకోవాలా? అన్నట్లు మాట్లాడారు.

ఇటీవల ఎమ్యెల్యేల కోటా నుండి ఎమ్యెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాపాక మాటలు దుమారం రేపాయి. వైసిపి నుండి క్రాస్ వోటింగ్ జరగడంతో, నలుగురు ఎమ్యెల్యేలను పార్టీ నుండి బహిష్కరించిన సమయంలో తనకు కూడా టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందని, రూ.10 కోట్లు ఇస్తామని తనతో బేరసారాలు చేశారని ఆరోపించారు.

దానితో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిజంగా అటువంటి ఆఫర్ వస్తే ఎన్నికల ముందే ప్రకటించకుండా తర్వాత ఎప్పుడో చెప్పడం ఏమిటి? అంటూ నిలదీశారు. నిజాయితీ గురించి మాట్లాడే రాపాక ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్లారో? గుర్తు తెచ్చుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. తరచూ వార్తలలో ఉండాలని అనుకొంటా వివాదాస్పద వాఖ్యలతో ఇబ్బందులలో కూరుకుపోవడం ఆయనకు పరిపాటిగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles