“తల్లీ, నేను కూడా బాడీ షేమింగ్ బాధితుడినే. శరీరాకృతి పట్ల హేళన ఎదుర్కొంటున్నవారిలో నేను కూడా ఉన్నాను” అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్వేగంతో చెప్పారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకోగా సోమవారం నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ‘మహిళా శక్తితో లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముఖాముఖి సమావేశం అయ్యారు.
“శాసనసభలో మా నాయకుడు అచ్చెన్నాయుడి గారిని వైఎస్‌ఆర్‌సిపి నేతలు పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. దేవుడు అందరినీ ఒకేలా తయారుచేయడు కదా” అని చెప్పుకొచ్చారు.
ఓ మహిళా సైకాలజిస్టు మాట్లాడుతూ మన విద్యా వ్యవస్థలో మానసిక సంక్షేమం, శారీరక సంక్షేమం అనే అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఓ సైకాలజిస్టుగా, ఓ తల్లిగా ఈ మాటలు చెబుతున్నానని చెబుతూ దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం, కుంగుబాటు, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యల తలెత్తుతాయని, దాంతో చిన్న వయసులోనే పిల్లలు డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు.
చాలా దేశాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు కూడా ఎడ్యుకేషన్ కర్రిక్యులమ్ లో స్థానం కల్పించి, ఆ సబ్జెక్టును తప్పనిసరిగా పాస్ అవ్వాలన్న నిబంధన తీసుకువచ్చాయని చెబుతూ రేపు టిడిపి గెలిచి అధికారంలోకి వస్తే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, మన స్కూళ్లలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆమె కోరారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ నుంచి పీజీ వరకు కర్రిక్యులమ్ ను మార్చడంపై చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను వేధించిన వారిని వదిలేది లేదని లోకేష్ హెచ్చరించారు. శాసనసభ సాక్షిగా ఏ తప్పు చేయని తన తల్లిని అవమానించిన విషయాన్ని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన నా తల్లినే ఇంత ఘోరంగా అవమానిస్తే.. సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులు చేసిన అసభ్యకర కామెంట్లకు సుమారు నెల రోజుల పాటు తన తల్లి కుమిలి పోయిందని గుర్తు చేశారు. ఆమె బాధను ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినా దానిని ఖండించాలని లోకేశ్ స్పష్టం చేశారు.
మహిళలపై దాడులు చేయడం వైసీపీ నాయకులు జన్మహక్కుగా భావిస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు అక్రమాలను ప్రశ్నించిన వారిపై మరిన్ని దాడులు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే తిరిగి వారిపై కేసులు పెడుతున్నట్లు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మహాశక్తి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.