నెల్లూరు జిల్లాలో `వైసిపి శవయాత్ర’గా `లోకేష్ పాదయాత్ర’!

Saturday, January 18, 2025

రాయలసీమలో దిగ్విజయంగా యువగళం పాదయాత్రను ముగించుకుని, మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ వర్గాల నుండి ఘనస్వాగతం లభించడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ సీట్లలో కూడా టిడిపిని ఓడించి, ఏకపక్షంగా గెలుపొందిన వైసీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది.

గత ఏడాది ఎమ్యెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అంటూ వైసిపి సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్యెల్యేలు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లలో తలమునకలవడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. సాంకేతికంగా వారు ముగ్గురు ఇంకా వైసీపీ ఎమ్యెల్యేలే. అయినా వారు పాదయాత్రలో ముందుంటున్నారు.

లోకేష్ పాదయాత్ర జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. ఇక్కడి నుండి రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఆనం రామనారాయణరెడ్డి సారధ్యంలో ఘన స్వాగతం లభించింది.

లోకేష్ కు స్వాగతం పలుకుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో బ్యానర్లు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. అయితే,  ఆ బ్యానర్లలో, కటౌట్లను స్థానిక టీడీపీ నేతల కంటే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఏర్పాటు చేసినవి కావడంతో వైసీపీ నేతలు తమాయించుకోలేక పోతున్నారు.

 పైగా, లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ప్రముఖ దినపత్రికల్లో మొదటిపేజీలలో పూర్తి పేజీ ప్రకటనలు జారీ చేశారు. ఆ ప్రకటనలలో ఒక వైపు లోకేష్, మరోవైపు ఆనం నిలువెత్తు ఫోటోలు కూడా ఉన్నాయి.

పైగా, ఆత్మకూరుతో పాటు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మొత్తం పాదయాత్ర ఎర్పాట్లు అన్నింటిని ఆనం స్వయంగా చేపడుతున్నట్లు చెబుతున్నారు. అందుకనే లోకేష్ పాదయాత్రను `వైసిపి శవయాత్ర’ అంటూ టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.

అదే విధంగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు సహితం తమ తమ నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్రల నిర్వహణ భారం చేపడుతున్నారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా కడప జిల్లాకు వెళ్లి లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటించి వచ్చారు. 

జగన్ సర్కార్ అవినీతిని, అసమర్థతను, అభివృద్ధి రహిత పాలనను ప్రజలకు వివరిస్తూ సాగుతున్న ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో వైసిపికి రాజకీయంగా ముప్పుగా మారనున్నట్లు అధికారపక్షం నేతలు ఆందోళన చెందుతున్నారు.

నాయుడుపల్లెలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహిస్తూ వైఎస్ జగన్ మంత్రివర్గంలో గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి  కోర్టులో చోరీ కేసు, సీబీఐ ఎంక్వయిరీలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రకృతి వైపరీత్యాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదని, ఒక్క సమస్య పరిష్కారించ లేదని మండిపడ్డారు. చంద్రబాబు  హయాంలో ఏర్పాటు అయిన వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ప్రస్తుత ప్రభుత్వం కరెంటు బిల్లులు కట్టలేక మూతపడ్డాయని విమర్శించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles