నెక్స్ట్​ టార్గెట్​ తెలంగాణ.. రాహుల్ మాటలతో బిజెపి కంగారు

Monday, September 16, 2024

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో విజయం తర్వాత తమ తదుపరి టార్గెట్ తెలంగాణాలో విజయం సాధించడమని చేసిన వాఖ్యలో బీజేపీలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హడావుడిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పిలిపించుకొని మాట్లాడినట్లు చెబుతున్నారు.

వాస్తవానికి, ఈ ఏడాది చివరిలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణాలో ప్రధాన పోటీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య కాగా, మిగిలిన రాస్త్రాలలో బిజెపి – కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. అయితే మిగిలిన నాలుగు రాష్ట్రాలకన్నా తెలంగాణకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వడం అంటే దేశంలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట.

తెలంగాణాలో ఇటీవల కాలంలో బిజెపి బలం పెరిగి, కాంగ్రెస్ ను వెనుకకు నెట్టివేసి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదిగిన్నట్లు బిజెపి నేతలు వేసుకున్న అంచనాలు కర్ణాటక ఫలితాల తర్వాత తలకిందులయ్యాయి. అందుకనే సీట్లు లేకపోయినా తెలంగాణాలో క్షేత్రస్థాయిలో ఇంకా మద్దతుదారులు ఉన్న టిడిపి సహకారం కోసం అమిత్ షా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

అయితే, పొత్తు పెట్టుకొంటే రెండు తెలుగు రాస్త్రాలలో పెట్టుకోవాలి గాని, ఒక్క తెలంగాణ అంటే సాధ్యం కాదని చంద్రబాబు స్ఫష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. మరోవంక, తెలంగాణ బీజేపీ నాయకులు టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేరు. 2018లో టిడిపితో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేస్తున్నారు. కానీ, టిఆర్ఎస్ జాతీయ పార్టీగా బిఆర్ఎస్ అవతారం ఎత్తిన తర్వాత పరిస్థితులు మారిన్నట్లు చంద్రబాబు తెలియచెప్పారు.

అమిత్ షా, జెపి నడ్డాడలతో చంద్రబాబు భేటీ జరపడం పట్ల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆత్మరక్షణలో పదిన్నట్లు ఆయన మాటలే చెబుతున్నాయి. టీడీపీతో బీజేపీ పొత్తు ఊహా గానాలేనని తోచిపుచ్చారు. కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ నేత నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు.

గతంలో పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్‌ వంటి ప్రతిపక్ష నేతలు కూడా.. మోదీ, అమిత్‌షాలను కలిశారు కదా? అంటూ పొంతనలేని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు చేసిన ప్రతిపాదనలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని అమిత్ షా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

“బీజేపీని మట్టికరిపించగలము అని మేము కర్ణాటకలో చూపించాము. మేము ఆ పార్టీని కేవలం ఓడించలేదు.. మట్టికరిపించాము. కర్ణాటకలో బీజేపీని గట్టిదెబ్బ కొట్టాము. వాస్తవానికి ఇది కాంగ్రెస్​ పార్టీ విజయం కాదు. ఆ పార్టీ విద్వేషపూరిత సిద్ధాంతాలను ప్రజలు తిప్పికొట్టారు,” అని న్యూయార్క్​లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పారు.

“విపక్షాన్ని ఓడించేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ దగ్గర మొత్తం మీడియా ఉంది. మా దగ్గర ఉన్న డబ్బు కన్నా వాళ్ల దగ్గర 10రెట్లు ఎక్కువ నిధులు ఉన్నాయి. ఏజెన్సీ కూడా వారి వెనకే ఉంది. కానీ మేము వారిని మట్టికరిపించాము” అని తెలిపారు.

“నేను మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. మా నెక్స్ట్​ టార్గెట్​ తెలంగాణ. బీజేపీని అక్కడ మట్టికరిపిస్తాము. వచ్చే ఎన్నికల తర్వాత.. తెలంగాణలో బీజేపీ కనిపించడమే కష్టంగా మారుతుంది,” అని రాహుల్​ గాంధీ చెప్పడంతో అమిత్ షా అప్రమత్తం అవుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణాలో బిఆర్ఎస్ తిరిగి గెలిచినా ఫర్వాలేదు గాని కాంగ్రెస్ మాత్రం రాకూడదని మొదటి నుండి బిజెపి విధానంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles