ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ప్రభుత్వం సుప్రీం కాదు. అందరికంటె అన్నింటికంటె సుప్రీం వ్యవస్థ రాజ్యాంగం మాత్రమే. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మాకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం.. తోకజాడిస్తాం అంటే వ్యవస్థలు ఊరుకోవు. మొట్టికాయ్ వేసి బుద్ధి చెబుతాయి. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి సర్కారుకు అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రభుత్వం చాలా దూకుడు ప్రదర్శించి తీసుకువచ్చిన జీవో నెం.1 విషయంలో హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆ జీవోను సస్పెండ్ చేసింది.20లోగా కౌంటరు వేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గుంటూరు, కందుకూరుల్లో చంద్రబాబునాయుడు సభల్లో జరిగిన దుర్ఘటనలకు ముడిపెట్టి.. అసలు రోడ్ షోలు, రోడ్ల మీద సభలు, సమావేశాలు నిర్వహించడాన్నే పూర్తిగా నిషేధిస్తూ సర్కారు ఈ ఏడాదిలో మొట్టమొదటిదిగా జీవో నెం.1 తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిని బేస్ చేసుకునే.. కుప్పంలో లోకల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు కూడా అనేక రకాల ఆంక్షలు నిర్వహించారు. ప్రతిఘటించిన తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం సహా అనేకానేక కేసులు పెట్టారు.ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి కలవడం, సంఘీభావం ప్రకటించడం.. ఇద్దరూ కలిసి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జీవో నెం.1కు వ్యతిరేకంగా ఐక్య రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించడం కూడా జరిగింది.
అదే సమయంలో ఎన్నడో 1860 కాలంలో.. భారతదేశంలో చిన్నచిన్న ప్రజల అసంతృప్తులను కూడా దారుణంగా అణచివేసే ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఆధారం చేసుకుని, ఇప్పుడు జగన్ సర్కారు తెచ్చిన జీవో బహుధా చర్చనీయాంశం అయింది. రాజ్యాంగం ప్రసాదించే మౌలిక హక్కులను కాలరాసేలా ఉన్నదనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈజీవోను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఎవరైనా ఆశ్రయించినా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కుట్రపూరితంగా ఈ జీవో తెచ్చారని ఆరోపించారు. విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి చురకలంటించేలా అనేక వ్యాఖ్యలు చేసింది. బ్రిటిష్ వారు ఈ చట్టం ప్రయోగించి ఉంటే అసలు స్వాతంత్ర్యపోరాటం జరిగేదేనా? మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావడం లేదు.. అని న్యాయస్థానం పేర్కొంది.
ఈ కొత్త సంవత్సరంలో జగన్ సర్కారు తెచ్చిన మొట్టమొదటి జీవోకే ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.
నెం.1కి మొట్టికాయ్ : అనుకున్నదే అయింది!
Wednesday, January 22, 2025