దేశం మొత్తం ఆశ్చర్యపరిచేలా, ఇంద్రభవనాన్ని తలపించే విధంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయంకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తుంటే బీజేపీ మాత్రం సచివాలయం భవనం పైన నిర్మించిన డోములపై పంచాయతీ పెడుతున్నది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ ప్రతిబింబంగా సచివాలయ నిర్మాణం జరిగింది ప్రభుత్వం చెబుతుంటే, మసీదు నిర్మాణాన్ని తలపిస్తోందని బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
రూ. 610 కోట్ల వ్యయంతో, ఇండో- పర్షియన్- అరేబియన్ శైలితో పాచు.. దక్కన్ కాకతీయ స్టైల్‌లో ఈ భవనాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా జాతీయ చిహ్నలను ప్రతిష్ఠించిన రెండు ప్రధాన గుమ్మటాలతో పాటు 34 చిన్న గుమ్మటాలతో ఈ సచివాలయాన్ని నిర్మించగా, ఇప్పుడు వాటినే బిజెపి వివాదంగా మారుస్తుంది. హిందూ – ముస్లిం భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నిర్మాణ శైలిలో మచ్చుకైనా తెలంగాణ వారసత్వం కన్పించట్లేని బిజెపి ధ్వజమెత్తింది. శాతవాహనులు, కాకతీయల సంస్కృతి ఎక్కడ? అని నిలదీస్తుంది. నిజాం వారసత్వ చరిత్రకు నయా నిజాం తాపత్రయ పడుతున్నాండంటూ ఆక్షేపిస్తోంది. ఎంఐఎం సంతృప్తి కోసమే ఈ సచివాలయ నిర్మాణమా అంటూ బేజీపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
తాను సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లబోనని ప్రకటించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సెక్రటేరియట్ లా కన్పించడం లేదని, ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంతృప్తి పరచడానికే కట్టినట్టుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్క్రతికి అనుగుణంగా మార్పులు చేసిన తర్వాతే సచివాలయానికి వెళ్తానని ప్రకటించారు.
అయితే, రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయంపై భారతీయ జనతా పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారని, ద్వేషపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీలను ఒకసారి పరిశీలించాలని హితవు చెప్పారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో సచివాలయాలను ఎలా నిర్మించారో చూడాలని అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు.
తెలంగాణ సచివాలయం దక్కన్ కాకతీయ శైలిలో, మనోహరమైన రీతిలో, భారీ డోములతో రూపుదిద్దుకున్న అద్భుత కట్టడమని, తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా నిర్మాణం జరిగిందని బిఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే, ఇంత గొప్పగా నిర్మించిన సచివాలయంపై కూడా నీచ రాజకీయాలు చేయడం బీజేపీ పార్టీకే చెల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతే కాదు దేశంలో డోమ్ డిజైన్లతో ఉన్న ప్రముఖ కట్టడాల ఫొటోలను జతచేస్తూ బీజేపీకి కౌంటర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు, మైసూర్ ప్యాలెస్, కర్ణాటక అసెంబ్లీ, ఢిల్లీ సెక్రటేరియట్, గుజరాత్ అసెంబ్లీ.. ఇలా డోములతో నిర్మించిన భవనాలను చూపిస్తూ బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టింది.
కాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డొనాల్డ్ ట్రంప్‌కు బహుమతిగా తాజ్‌మహల్ ఫోటో ఫ్రేమ్‌ను అందజేసిన విషయాన్ని ఒక నెటిజన్ గుర్తు చేశారు. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనాన్ని మరో నెటిజెన్ షేర్ చేస్తూ ఈ పార్లమెంట్ భవనం ఏ హిందూ టెంపుల్‌ను ప్రతిబింబిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.