నిర్మలమ్మకు జగన్ పై ఫిర్యాదులు పట్టేనా!

Tuesday, November 5, 2024

వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో విమర్శలు కురిపించడం వరకు బిజెపి అగ్రనేతలకు అభ్యంతరం ఉండదు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదులతో కొత్తగా రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వరకు వెడితే ప్రయోజనం ఉంటుందా? పైగా జగన్ ప్రభుత్వం పాల్పడుతున్న ఆర్థిక అక్రమాలు, అడ్డదారిలో అప్పులు చేయడం వంటి అంశాలు ఢిల్లీ ప్రభువులకు తెలియవా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి మించి అడ్డదారుల్లో అప్పులు చేస్తోందని అంటూ ఆమె నేరుగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కొన్ని గణాంకాలతో సహా ఆమెకు వివరించారు.

అయితే, వైఎస్ జగన్ ను ప్రధాని నరేంద్ర మోదీ `మానస పుత్రుడు’ అంటూ అనంతపూర్ జిల్లా పర్యటన సందర్భంగా బహిరంగంగా పేర్కొన్నా నిర్మలమ్మకు జగన్ అంటే ప్రత్యేక అభిమానం ఉన్నట్లు ఆమె వ్యవహారశైలి స్పష్టం చేస్తుంది.  నూతన పార్లమెంట్ భవన్ ప్రారంభం సందర్భంగా కూడా ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని చిరునవ్వులు విసురుకోవడం గమనించాము.

పైగా, పురందేశ్వరి ప్రస్తావించిన ఆర్ధిక అక్రమాలు ఏవీ కేంద్ర ప్రభుత్వంకు తెలియనివి కావు. మాటవరసకు పలు పర్యాయాలు ఆర్హ్తిక శాఖ వివరాలు కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖలు వ్రాస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పార్లమెంట్ వేదికగా ఆర్ధిక సహాయ మంత్రులు పలు సందర్భాలలో జగన్ ఆర్ధిక అక్రమాల గురించి ప్రస్తావించారు కూడా.

అయినా, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా జగన్ అడిగిందే తడవుగా ఎప్పటికప్పుడు కొత్త రుణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఉదారంగా నిధులు మంజూరు చేస్తూ జగన్ ను ఆర్థికంగా ఇబ్బందుల నుండి ఎప్పటికప్పుడు ఆడుకొంటున్నారు. పంచాయతీ నిధులను పంచాయతీలకు దక్కకుండా వాడేసుకొంటున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇతరత్రా నిధుల తరలింపు గురించి పట్టించుకోవడం లేదు.

బహుశా బిజెపి పాలిత రాష్ట్రాల పట్ల కూడా ఆర్ధిక వ్యవహారాలలో నిర్మలమ్మ ఇంత ఉదారంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు. అటువంటి ఆమెను కలిసి పురందేశ్వరి వినతి పత్రం ఇవ్వడం ద్వారా మీడియా దృష్టిని ఆకట్టుకోవడం మినహా ఫలితం ఉండదు. రాష్ట్రంలో అప్పులే మినహా ఆస్తుల కల్పన లేదని ఆరోపిస్తూ నిధుల మళ్లింపును నిర్మల దృష్టికి తీసుకెళ్లినట్లు చిన్నమ్మ వెల్లడించారు.

పైగా, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. జగన్ ప్రభుత్వానికి నిధుల అక్రమ వినియోగంలో సహకరించవద్దని అయితే విజ్ఞప్తి చేశారు. అయితే, పాత రాష్త్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ కనుసన్నలలో పనిచేస్తూ పార్టీకి తీవ్ర హానిచేస్తున్నారని పలువురు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెడితే కనీసం వారిని కూర్చోమని మర్యాద కూడా మురళీధరన్ చూపించలేదు.

పరోక్షంగా వైఎస్ జగన్ ప్రభుత్వంకు మురళీధరన్ కూడా బాసటగా నిలిచారు. ఏపీలో బిజెపి వ్యవహారాలు ఇంత అధ్వాన్నంగా మారితే ఇన్ ఛార్జ్ గా తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేందటూ తర్వాత మురళీధరన్ అమిత్ షా మందలించినట్లు తెలుస్తున్నది. అటువంటి నేతతో కలిసి నిర్మలమ్మకు ఫిర్యాదులు చేస్తే ప్రయోజనం ఉంటుందా?

కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పులు అధికారికమో? అనధికారికమో? ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఆస్తులకు తనఖా పెట్టి చేసిన అప్పుల గురించి వివరణ ఇవ్వాలని, కాంట్రాక్టర్లకు పెండింగ్​లో ఉన్న వేల కోట్ల బిల్లులపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఇటువంటి ప్రశ్నలన్నీ అరణ్యరోదనగా మిగిలే అవకాశం ఉంది. నిర్మలమ్మ గాని, ప్రధాని మోదీ గాని బహిరంగసభలలో తప్ప కార్యాచరణలో స్పందించే అవకాశం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles