నిజామాబాద్ లో బిజెపి ఎంపీ అరవింద్ కు పసుపు బోర్డు సెగ!

Wednesday, January 22, 2025

అనూహ్యంగా గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయినా సీఎం కేసీఆర్ కుమార్తె కవితనే ఓడించి ఎన్నికైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వార్తలలో ప్రముఖంగా నిలిచారు. అయితే, మరో ఏడాదిలో తిరిగి ఎన్నికలను ఎదుర్కోవలసి వచ్చేసరికి ఆయన నియోజకవర్గంలో ప్రతికూలత ఎదుర్కొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం చేత పసుపు బోర్డు ఏర్పాటు చూపిస్తానని అంటూ రైతులకు బాండ్ పేపర్ పై ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోవడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన మాత్రమే కాదు, కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, అప్పట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వంటి వారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేశారు.

కానీ, ఆ దిశలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు.  తాజాగా, పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కన్నెర్ర చేస్తున్న రైతులు స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా “పసుపు బోర్డు… ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు” అని పేర్కొన్న పసుపు రంగు ఫ్లెక్సీలను  కట్టారు.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకు వస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బాండ్ పేపరు రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగేళ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. అన్నదాతలను మోసం చేసిన ఎంపీ అర్వింద్ కు పుట్టగతులు ఉండవని రైతులు హెచ్చరిస్తున్నారు. బోర్డు కోసం గత కొంత కాలంగా నిరసనలు తెలుపుతున్న రైతులు పలుసార్లు అర్వింద్ ను అడ్డుకున్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీశారు.

ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో బిజెపి నేతలకు పాసుబు రైతుల సెగ తప్పనిసరిగా కనిపిస్తున్నది. పసుపు బోర్డు కోసం రైతులు ఆందోళనలను ఉదృతం చేయడానికి సిద్దపడుతూ ఉండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్న అధికార బిఆర్ఎస్ కు  మంచి ప్రచార అస్త్రం దొరికినట్లయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles