పక్షం రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో `యువగళం’ పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ యాత్ర కొనసాగింపలేని పరిస్థితులు సృష్టిస్తున్నారు. అయినా, మొండిగా లోకేష్ యాత్రను మాత్రం కొనసాగిస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఎన్నికల కోడ్ ను అడ్డుపెట్టుకొని యాత్రను అడ్డుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రావడంతో స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ పేరుతో లోకేష్ యాత్రను అడ్డుకొనేందుకు అధికార యంత్రంగం సన్నాహాలు చేస్తున్నది.
నిస్పక్షపాతంగా ఉన్నామని చెప్పుకొనేందుకు అధికార పక్షం నిర్వహిస్తున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సహితం నిలిపివేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ వివరణ కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఓ లేఖ కూడా వ్రాసారు.
చిత్తూరుజిల్లా కలెక్టర్ హరినారాయణన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడంతో.. ఎన్నికలు జరిగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అందుకే గడప గపడకు మన ప్రభుత్వంతో పాటూ లోకేష్ పాదయాత్ర కొనసాగించడంపై కలెక్టర్ స్పష్టత కోరారు. ఈ కార్యక్రమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తుందని అధికారులు అంటున్నారని పేర్కొంటూ ఈ విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశానికి ఎదురు చూస్తున్నట్లు కలెక్టర్ తన లేఖలో పేర్కొన్నారు.
ఆ లెక్కన రాష్ట్రం అంతటా ఉపాధ్యాయులు లేదా గ్రాడ్యుయేట్లు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దానితో మార్చిలో ఎన్నికలు ముగిసేవరకు లోకేష్ యాత్ర జరుపకుండా అడ్డుకొనే అవకాశం ఏర్పడుతుంది. అయితే, ఈ ఎన్నికలలో ఓటర్లు పరిమితంగా ఉంటారు. సాధారణ ఎన్నికలలో మాదిరిగా బహిరంగ సభలు, ర్యాలీలు జరిపే అవసరం ఉండదు.
నిర్దుష్టమైన మార్గదర్శకాలు సూచిస్తూ ఎన్నికల కమీషన్ లోకేష్ యాత్రకు అనుమతి ఇచ్చేందుకు న్యాయపరంగా అభ్యంతరం ఏర్పడక పోవచ్చు. పైగా, ఈ యాత్ర ఎన్నికల ప్రకటనకు ముందే ప్రారంభమైంది. 400 రోజులపాటు జరుగవలసి ఉంది.
అదీగాక, లోకేష్ గాని, ఆయన పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో లేదు. కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. అందుచేత, ఈ విషయంలో ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తోంది అన్నది కీలకంగా మారనుంది. లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.