విజయవాడ ఎంపీ తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నాని తన సొంత పార్టీ మీద అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీని ధిక్కరించే మాటలు మాట్లాడుతున్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు తనను విమర్శిస్తుండడం కూడా ఆయనకు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులతో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అధికార వైసీపీ నాయకులు ఆయన మంచితనాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారు కూడా!
తెలుగుదేశంతో ఆయన విభేదిస్తున్న ఇలాంటి వాతావరణాన్ని వైసీపీ తమకు ఎడ్వాంటేజీగా మార్చుకోవాలని చూస్తోంది. ఆయననే అభ్యర్థిగా తెచ్చుకోవాలని కలగంటున్నదో ఏమో తెలియదు గానీ.. ఆయనకు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నది. నాని మంచినాయకుడని కితాబులు ఇస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విశ్లేషిస్తోంటే.. కేశినేని నానిని తమ పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నదని, ఆయనకు మించి వారికి ఆ నియోజకవర్గంలో గతిలేదేమోనని అనిపిస్తోంది.
ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో కేశినేని నాని మీద పోటీకి వైసీపీ కోనేరు ప్రసాద్ ను మోహరించింది. ఆయన అదివరలో చంద్రబాబుకు సన్నిహితుడే గానీ, టికెట్ రేసులో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. ఎన్నికల్లో డబ్బు వరదలా పారింది. నాని గెలిచారు. వైసీపీ రాజకీయాల్లో కోనేరు ప్రసాద్ కనిపించకుండా అంతర్ధానం అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అదే నాని మీద పోటీకి పొట్లూరి వరప్రసాద్ ను దించింది. మళ్లీ డబ్బు వరదలా పారింది. ఓటు శాతం, మెజారిటీ కాస్త తగ్గినా కేశినేని నాని మళ్లీ గెలిచారు. పొట్లూరి వరప్రసాద్ వైసీపీ రాజకీయాల్లో అంతర్ధానం అయ్యారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీకి గతిలేని స్థితి ఉంది. అందుకే ఇప్పుడు నానికి టీడీపీతో విభేదాల్ని వాడుకుని ఆయనను దువ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే కేశినేని నానికి తన మీద తనకే క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీచేయబోనని, రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని ఆయన ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే, తెలుగుదేశం మీద ధిక్కారస్వరం వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశంతో పాటూ ఇతర పార్టీల్లోని ప్రజలందరూ ఓట్లు వేస్తేనే తాను గెలిచానని, తనకున్న ప్రజాదరణ చూస్తే ఇండిపెండెంటుగా పోటీచేసినా కూడా గెలుస్తానని అనిపిస్తోందని ఆయన అన్నారు. చాలా మంది నాయకులకు ఇలాంటి అతి ఆత్మవిశ్వాసం నెత్తికెక్కుతూ ఉంటుంది. ఆ తర్వాత, అలాంటి ప్రయోగాలు చేసి బొక్కబోర్లా పడుతుంటారు. కేశినేని నానికి తెలుగుదేశం నచ్చకపోతే, ఆయన వైసీపీ పంచన చేరి రాజకీయం కంటిన్యూ చేసుకోవచ్చు గానీ, ఇండిపెండెంటు లాంటి ప్రయోగాలతో నష్టపోతారని విజయవాడ వాసులు అనుకుంటున్నారు.
నానికి వైసీపీ పొగడ్తలు గతిలేనితనమేనా?
Friday, November 15, 2024