నానా కష్టాలు పడినా.. ఫలం దక్కలేదు!

Wednesday, January 22, 2025

‘వ్రతం చెడినా.. ఫలం దక్కింది’ అని సామెత. కానీ వర్తమాన రాజకీయంలో దీనిని కొంచెం తేడాగా చదువుకోవాలి. నానా కష్టాలు పడి వ్రతం పూర్తి చేసినా కానీ ఫలం మాత్రం దక్కలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము ఏం చేయదలచుకుంటే అది చేస్తుంది. దానిని సాధించుకుంటుంది.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోవాలని పార్టీ తలపోసింది, అయితే వారి ఎత్తుగడలను  అధిగమించి తెలుగుదేశం మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు చేశారు.  వైసిపి ఆశ నెరవేరదని అందరూ అనుకున్నారు. స్క్రూటినీ అనంతరం  ఆ నామినేషన్లను తిరస్కరించడం ద్వారా,  చివరికి తాము అనుకున్నదే జరిగేలాగా వైసిపి  పంతం నెగ్గించుకుంది. 

రాష్ట్రంలో అనేక చోట్ల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీ వి అంటూ అధికారులు వాటిని తిరస్కరించడం విశేషం.  అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి స్వతంత్రులను బలపరిచిన వ్యక్తులను బెదిరించి తమ సంతకాలు ఫోర్జరీ అని వారితో చెప్పించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కొన్నిచోట్ల పోలీసులతో ఒత్తిడి చేయించి ఇలా చెప్పించినట్లు కూడా తెలుస్తోంది.  

అనంతపురం ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జెసి సోదరులు అనుచరుడు వేలూరు రంగయ్య నానా కష్టాలు పడి నామినేషన్ వేశారు.  ఆయన నామినేషన్ వేయకుండా కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ బలగాలు మోహరించి ఉండటంతో.. ఆయన కలెక్టరేట్ వెనుక వైపు ఉన్న  స్మశానం గోడదూకి,  వెనుక ఉన్న ద్వారం గుండా లోపలికి ప్రవేశించి మొత్తానికి నామినేషన్ వేశారు.  ఆయనను బలపరిచిన వారెవరు తమ సంతకం ఫోర్జరీ అని చెప్పగల అవకాశం కూడా లేదు. . దీంతో తగినంత మంది వ్యక్తులు ప్రతిపాదించలేదు  అనే సాకుతో ఆయన నామినేషన్ను కూడా తిరస్కరించారు. 

నెల్లూరు ఎమ్మెల్సీ విషయంలో దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురి అయింది.  ప్రతిపాదించిన వారిలో సూళ్లూరుపేట కౌన్సిలర్ చెంగమ్మను, స్వయంగా ఎంపీ గురుమూర్తి తదితరులు తీసుకువెళ్లి తన సంతకం ఫోర్జరీ అయినట్టుగా బలవంతంగా చెప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పలుచోట్ల రకరకాల సాకులు చూపించి స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం గమనార్హం.

మొత్తానికి  తిమ్మిని బమ్మిని చేసి..  ప్రత్యర్థుల నామినేషన్లను తిరస్కరింపజేసి..  మాయ మంత్రాంగం ద్వారా  తాము ఏకగ్రీవం అయ్యామని వైఎస్ఆర్సిపి డప్పు కొట్టుకోవచ్చు.  కానీ ప్రజలు మాత్రం అధికార పార్టీకి ఎన్నికలను ఎదుర్కోవడానికి తగిన ధైర్యం లేకుండా దిగజారిపోయిందని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles