నాట్ జస్ట్ గుంటూరు.. స్టేట్ మొత్తం డ్యూటీ..!

Sunday, January 19, 2025

కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీకి ఖచ్చితంగా అదనపు బలం చేకూరినట్టేననే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. రాయపాటి సాంబశివరావు వంటి కొందరు వ్యతిరేకించినప్పటికీ.. చంద్రబాబునాయుడు, కన్నా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయనను తమ పార్టీలోకి చేర్చుకోవడానికే నిర్ణయించుకున్నారు. కన్నా కూడా ఘనంగా దాదాపు మూడు నాలుగు వేల మంది అనుచరులతో ప్రదర్శనగా వెళ్లి, ముందుగా చూసుకున్న ముహూర్తానికి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. 

అయితే కన్నా లక్ష్మీనారాయణ రాక ద్వారా.. కేవలం గుంటూరు జిల్లాలో మాత్రమే కాకుండా.. రాష్ట్రమంతా కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాలో చాలా బలమైన నాయకుడు అనే సంగతి అందరికీ తెలుసు. అయితే అది ఒకప్పటిదాకా మాత్రమేనని, భాజపాకు రాష్ట్ర సారథ్యం వహించిన తర్వాత.. ఆయన రాష్ట్రవ్యాప్త నాయకుడిగా ఆవిర్భవించారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన కులాలు రెండు పార్టీలకు పరిమితమైన నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవడానికి బిజెపి వ్యూహాత్మకంగా కన్నాకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. ఆ అవకాశాన్ని ఆయన చక్కగా వాడుకున్నారు. రాష్ట్రమంతా తిరిగారు. కాపు వర్గం మాత్రమే కాదు.. బాజపా శ్రేణుల్లో తనకు ఒక గౌరవాన్ని సంపాదించుకోగలిగారు. అయితే కన్నా తరువాత సోము వీర్రాజు చేతిలో పార్టీ పగ్గాలు పెట్టిన తర్వాత పరిస్థితి మొత్తం మారింది. ఆయన తన ఒంటెత్తు పోకడలతో కనీసం తన కులాన్ని కూడా దగ్గరకు తీసుకోలేకపోయారు. భాజపాకు అదివరలో ఎంత బలం ఉన్నదో.. అదే బలం కొనసాగిందే తప్ప.. సోము వీర్రాజు రెక్కల కష్టం వల్ల.. ఆ పార్టీ రాష్ట్రంలో విస్తరించినది చాలా తక్కువ. పైగా ఆయన తన దురుసుతనం వల్ల పార్టీలో తనకంటె సీనియర్లలో కూడా అనేకమంది వ్యతిరేకుల్ని శత్రువుల్ని తయారు చేసుకున్నారు. 

సోము వైఖరిపట్ల నిరసనగానే కన్నా బయటకు వెళ్లారు. మరికొందరు నాయకులు ఢిల్లీలో పెద్దలను కలిసి సోము మీద తమ మనస్తాపం వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొందరు బిజెపి నేతలు కూడా తనతో టచ్ లో ఉన్నారనడం ద్వారా ముందుముందు తెలుగుదేశంలోకి మరిన్ని చేరికలు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు. 

ఇప్పుడు కన్నా కేవలం గుంటూరు జిల్లా కే పరిమితం కాకుండా, రాష్ట్రమంతా తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడగల నాయకుడిగా తెలుగుదేశానికి దొరికారు. ఒక రకంగా చూసినప్పుడు.. ఆ రకంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం తన ప్రభావం ఉన్న సీనియర్ నాయకులు తెలుగుదేశంలో లేరు. ఆ ఖాళీని కన్నా భర్తీ చేసే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles