తొలిసారి తెలంగాణ వెలుపల మహారాష్ట్ర నాందేడ్‌లో ఆదివారం జరిపిన బిఆర్ఎస్ భారీ బహిరంగసభలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని లక్ష్యంగా చేసుకొంటూ జాతీయ రాజకీయాలలో తన అజెండాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెల్లడించారు. జాతీయ రాజకీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రకటించిన తర్వాత తొలిసారిగా గత నెల 18న ఖమ్మంలో బహిరంగసభ జరుపగా, రెండు సభను ఇక్కడ జరిపారు. అయితే, ఖమ్మంలో వలే ఈ సభకు ఇతర రాష్ట్రాల నుండి కీలక నాయకులు ఎవ్వరిని ఆహ్వానించలేదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లలో 54 సంవత్సరా లు కాంగ్రెస్, 16 సంవత్సరాలు బిజెపి పాలించాయని గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు కలిసి ఏం సాధించాయని ప్రశ్నించారు. తద్వారా ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకొని వివమర్శలు కురిపించారు. తెలంగాణాలో ఆ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు కావడంతో, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన రాష్ట్రం సరిహద్దుకు దగ్గరలో ఈ బహిరంగసభ జరిపినట్లు స్పష్టం అవుతుంది.
రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆలోచనలు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. నువ్వు అంత తిన్నావంటే…. నువ్వు ఇంత తిన్నావంటూ తిట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణమని మండిపడ్డారు. తెలంగాణాలో రైతులకు అమలవుతున్న పధకాలు మహారాష్ట్రాలో, ఇతర రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడం ద్వారా తమ ప్రభుత్వం అందరికన్నా ముందున్నదని తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వచూసినట్టు అర్ధం అవుతుంది.
ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలను కేసీఆర్ ఎక్కుపెట్టిన్నట్లు చెప్పవచ్చు. మేకిన్ ఇండియా…. జోకిన్ ఇండియాగా మారిందని అంటూ మోదీ అభివృద్ధి మంత్రాన్ని ఎద్దేవా చేశారు. చిన్నచిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని నిలదీశారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయని చెప్పారు.
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం రేజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం ద్వారా మహిళా ఓటర్లపై రాష్ట్రం ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. దేశంలో మహిళా రిజర్వేషన్లు రాకపోవడానికి బిజెపి, కాంగ్రెస్ కారణం అన్నట్లు నిందించారు. దేశంలో పలు రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు కూడా ప్రస్తావిస్తూ కేవలం తెలంగాణ మాత్రమే 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నదని స్పష్టం చేశారు.
తెలంగాణాలో అమలవుతున్న దళితబంధు, ఇతర పధకాలను ప్రస్తావించడం సహితం ఆయా పథకాలతో పొరుగు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడం మాట అటుంచి, తెలంగాణలోని ప్రజలకు తన ప్రభుత్వం మించి మరే ప్రభుత్వం ఆరీతిలో సంక్షేమ పధకాలు అమలు పరచలేదని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. పైగా, కేసీఆర్ బహిరంగసభకు సమీపంలోని తెలంగాణ జిల్లాల ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించినట్లు తెలుస్తున్నది. అందుకనే మహారాష్ట్రంలో తెలంగాణ షోగా బహిరంసభ జరిగిన్నట్లు పలువురు భావిస్తున్నారు.