నల్గొండ లోక్ సభ సీట్ పై జానారెడ్డి కన్ను!

Monday, December 23, 2024

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సుదీర్ఘకాలం మంత్రి పదవులలో ఉంది రికార్డు సృష్టించిన కె జానారెడ్డి ఈ సారి నల్గొండ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సీటుపై దృష్టి సారిస్తున్నారు.

అయితే లోక్ సభ కన్నా ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయినా, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందినా పలువురు సీనియర్ నాయకులు లోక్ సభ సీటుకోసం పోటీపడే అవకాశం ఉంది. అందుకనే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తనకు అండగా ఉండేందుకు జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

పార్టీలో సీనియర్ నాయకులు అందరూ దాదాపుగా రేవంత్ రెడ్డి అంటే అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తూ ఉంటె,  జానారెడ్డి మాత్రం సహకారం అందిస్తూనే వస్తున్నారు. పైగా, తాజాగా టీపీసీసీకి నాయకత్వం వహించేందుకు రేవంత్ కంటే గట్టి నేత ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. రేవంత్ రెడ్డి స్థానంలో మరో నేతను నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టమని.. అందుకు సమయం కూడా లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఎవ్వరు ఇప్పటి వరకు ఇంత గట్టిగా రేవంత్ కు మద్దతు తెలిపిన సందర్భం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలకు సీనియర్ల నుంచి అంతగా సహకారం అందడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో జానారెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయం రేవంత్ కు కొండంత అండగా మారే అవకాశం ఉంది.

పార్టీలో కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని, కానీ వారిలో నాయకత్వం చేపట్టే సామర్థ్యం ఉంటుందని తాను అనుకోవడం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. పైగా, రాయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రేవంత్ నాయకత్వం గురించి కాంగ్రెస్ అధిష్ఠానంకు బలమైన సంకేతం పంపే ప్రయత్నం జానారెడ్డి చేశారని చెప్పవచ్చు.

రేవంత్ ను టిపిసిసి నాయకత్వం నుండి మార్చితే తీవ్ర నష్టం ఎదురు కాగలదని కూడా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి స్థానంలో మరో నేతను నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టమని.. అందుకు సమయం కూడా లేదని స్పష్టం చేశారు.

సుమారు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేకుండా ఎమ్యెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఆయన 2018లో నాగార్జున సాగర్ నుండి ఓటమి చెందడం, ఆ తర్వాత ఉపఎన్నికలో కూడా ఓటమి చెందడంతో దాదాపుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తన కుమారుడిని నిలబెట్టేందుకు చూస్తున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ కు బలమైన మూడు జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకటి కాగా, అందులో  కీలకమైన ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు వంటి వారు రేవంత్ కు సహాయనిరాకరణ కావిస్తున్నారు. కేవలం జానారెడ్డి మాత్రమే సానుకూలంగా ఉంటూ వస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles