2019 ఎన్నికలలో అంతులేని ప్రజా సానుభూతి సంపాదించుకొని అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడిన ఘటనలు అభూత కల్పనలని ఒక వంక స్పష్టం అవుతూ ఉండడంతో పాటు, పులివెందులలో తనకు కొండంత అండగా ఉంటూ వస్తున్న బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డి మరో బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్ట్ కావడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
తన అధికారిక కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసుకొని, ఈ గండం నుండి ఏ విధంగా బయటపడాలో అని మంతనాలు జరుపుతున్నారు. మరోవంక, బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వడం, అతనిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో మరింతగా ఖంగారు పడుతున్నారు.
గతంలో వలే ఈ కేసు ముందుకు కదులుతున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలసి ఏదోవిధంగా బైటపడే ప్రయత్నాలు ఈ సారి సాగవని గ్రహించినట్లున్నారు. భాస్కర్ రెడ్డి తన భార్య వైఎస్ భారతికి మేనమామ కావడం, పైగా, పులివెందులలో – కడప జిల్లాలో రాజకీయాలు అన్నింటిని ఆ తండ్రి కొడుకులే చూస్తుండటంతో వారిద్దరూ జైలుకు వెడితే సొంత జిల్లాలోనే తనకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన ప్రధానంగా జగన్ ను వెంటాడుతున్నది.
మొన్నటి వరకు `వై నాట్ 175- కుప్పం కూడా’ అంటూ ప్రతిపక్షం టిడిపిని సవాల్ చేస్తూ వచ్చిన జగన్ కు ఇప్పుడు టిడిపి వారి నుండే `వై నాట్ కుప్పం’ అనే సవాల్ ఎదురవుతున్నది. ఎమ్యెల్సీ ఎన్నికలలో పులివెందులలో టిడిపికి మొదటిసారిగా ఆధిక్యత లభించడంతో పరిస్థితులు చేజారుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రంగంలో లేకుండా కడప జిల్లాలో ఎన్నికలను ఎదుర్కోవడం సవాల్ గానే పరిగణమించే అవకాశం ఉంది.
మరోవంక, ఈ ఇద్దరి అరెస్ట్ లతో సిబిఐ దర్యాప్తు ముగించి, ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందా? మరింత ముందుకు వెడుతుందా? కుట్రకోణం గురించి కూడా దర్యాప్తుకు ఉపక్రమిస్తుందా? అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి. అదే జరిగితే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వైపుకు వెళ్లే అవకాశం లేకపోలేదనే కధనాలు వెలువడుతున్నాయి.
‘‘వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో మొదటి నుంచి అందరికీ తెలుసు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి చిన్నచేపలు. ఇంకా విచారించి, శిక్షించాల్సిన వారు తాడేపల్లె ప్యాలె్‌సలో ఉన్నారు” అంటూ పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణ చేశారు. ఏదేమైనా, అవినాష్ రెడ్డి చేస్తున్నట్లు సిబిఐ దర్యాప్తును తప్పుబట్టడం గాని, సిబిఐ అధికారుల తీరును విమర్శించడం గాని సీఎం జగన్, ఆయన సలహాదారులు చేయలేక పోతున్నారు.
ఒకవేళ సీబీఐని విమర్శిస్తే.. ఆర్థిక నేరాభియోగ కేసుల విచారణలో నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాకపోయినా మినహాయింపునిస్తున్న సీబీఐ ఆగ్రహించే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.