వయస్సు మీరడం, అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాజాగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో నరసరావుపేట నుండి తిరిగి లోక్ సభకు పోటీ చేస్తాననడం టీడీపీ వర్గాలలో కలకలం రేపుతోంది.
వాస్తవానికి గత రెండు, మూడేళ్ళుగా వచ్చే ఎన్నికలలో తాను పోటీచేయబోనని, తన కుమారుడు రంగాబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ ఇవ్వమని కోరుతున్నారు. మరోవంక, సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ కోసం దిగవంత మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం కూడా పట్టుబడుతూ ఉండడంతో ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఎటూ తేల్చకుండా వస్తున్నారు.
ఈ లోగా చిరకాల రాజకీయ ప్రత్యర్థి, మొదటినుండి చంద్రబాబు నాయుడును ద్వేషిస్తూ వస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరడం, సత్తెనపల్లి నుండి పోటీ చేయాలనుకోవడంతో ఆయన ఆశలు తలకిందులయ్యాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేటలతో పాటు బాపట్లలో కూడా టిడిపికి లోక్ సభకు బలమైన అభ్యర్థులు లేరు.
దీనిని సాకుగా తీసుకొని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన అల్లుడుకు ఆ సీట్ ఇప్పించుకునేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నాడు. మాజీ టిటిడి చైర్మన్ అయినా తన వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ కు ఈ సీట్ ఇప్పించుకోవడం కోసం బిసిలకు ఆ సీట్ ఇవ్వాలనే వాదనను తీసుకొచ్చారు.
అయితే, టిడిపికి మంచి పట్టు గల ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభ్యర్థులను ఎక్కడో కడప జిల్లా నుండి తీసుకువచ్చే ప్రయత్నం పట్ల టిడిపి వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా లేరని చెబుతున్నారు. అందుకనే, యనమల రామకృష్ణుడు రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టడం కోసమే చంద్రబాబు ఆదేశిస్తే నరసరావుపేట నుండి పోటీ చేస్తానని రాయపాటి సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి సుదీర్ఘకాలం ఎంపీగా ఉన్నా, జిల్లా రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నా రాయపాటి సాంబశివరావుకు వ్యతిగతంతా ప్రజలలో మంచి పేరుంది. తన వ్యాపారాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా, వివాదాలకు గురవుతున్నా ఏనాడూ స్థానిక ప్రజలను ఆర్థికంగా వేధించడం ఎరుగరు. ఎవ్వరు సహాయం కోసం వచ్చినా సానుకూలంగా స్పందిస్తుంటారు.
మరోవంక, ఆయన తమ్ముడు కుమార్తె రాయపాటి శైలజ అమరావతి రైతుల ఉద్యమంలో అగ్రభాగంలో ఉండి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆమెకు సీట్ ఇవ్వాలని అమరావతి రైతులే కోరుతున్నారు. రాయపాటి ఇప్పుడు గట్టిగా గళం విప్పడంతో యనమల ఎత్తుగడలు నరసరావుపేటలో ఫలించడం కష్టం కాగలదు.
కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో ప్రవేశించడం పట్ల మొదట్లో వ్యతిరేకించినా తర్వాత రాయపాటి సర్ధుకున్నారు. కన్నా సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నా జిల్లాలో ఒక్క ఎమ్యెల్యే కూడా ఆయనతో ఉండేవారు కాదు. ఆయనతో సన్నిహితంగా ఉన్నవారంతా కొద్దీ అర్జులకే దూరం అవుతూ ఉండటం, ఆయన రాజకీయ సంబంధాలకన్నా ఆర్ధిక సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో కొంత ప్రతికూలతను మూటగట్టుకొంటున్నారు. అందుకనే పదవి లేకపోతే తనను ఎవ్వరూ పట్టించుకోరనుకొనే టిడిపిలో చేరారు.