2024 ఎన్నికలే లక్ష్యంగా `వారాహి విజయ యాత్ర’ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను హత్య చేసేందుకు వైసీపీ పాలకులు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్ లను దింపారనే సమాచారం తన వద్ద ఉందని సంచలన వాఖ్యలు చేశారు. వైసీపీ పాలకులు అధికారంకోసం ఏం చేయడానికన్నా సిద్దమే అంటూ వారి నుండి తనకు ప్రాణహాని ఉందని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతోంది.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయి ఉంటె తనని చంపేసేవారని అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో చేసిన ఈ వాఖ్యలు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. అయితే భయపెట్టే కొద్దీ తాను మరింతగా రాటు దేలుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
కాగా, ఆయన చేసిన ఈ వాఖ్యలు కేవలం సంచలనం కలిగించి, తన యాత్ర పట్ల ప్రజల దృష్టి ఆకట్టుకోవడం కోసమా? లేదా గత నాలుగైదు రోజులుగా పలువురు మంత్రులు, వైసిపి మంత్రులు ఆయనను దుర్భాషలాడుతూ చేస్తున్న ప్రకటనల మేరకు పవన్ కళ్యాణ్ ను `తీవ్రమైన రాజకీయ ప్రమాదకారి’గా భావిస్తూ, వెంటాడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు రెక్కీ నిర్వహించారని గత ఏడాది నవంబర్‌లో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ జరిపిన పోలీసులు.. ఆ యువకులు తాగి రభస చేశారని.. పవన్‌కు ప్రాణహాని లేదని స్పష్టం చేశారు.
“అధికారం చేజిక్కించుకునే నాయకులు క్రూరంగా మారిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోల్పోకూడదు అని బలంగా భావిస్తారు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు” అంటూ తనపై హత్యాప్రయత్నాలకు కారణాలను విశ్లేషించారు.
“బాలు సినిమా సమయంలో ఓ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నారా? అని అడిగారు.. ఎందుకు అని నేను అడిగితే మీ కుటుంబానికి హాని తలపెట్టే అవకాశం ఉంది అని చెప్పారు” అని వెల్లడించారు.
“రాజకీయాల్లోకి మా కుటుంబం వస్తే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందనీ, మేం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పించేందుకు మా ఇంటి ఆడబిడ్డల మీద విపరీతమైన దుష్ర్పచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
“రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది. తమకు హాని చేస్తారని తెలిస్తే, కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరు. ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉంది. అధికారం నుంచి వైసిపి పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు” అంటూ పార్టీ సహచరులను హెచ్చరించారు.