నడ్డా పర్యటనకు ఈటెల, కోమటిరెడ్డి దూరం!

Thursday, May 2, 2024

తెలంగాణాలో బిజెపి వ్యవహారాలపై ఢిల్లీకి పిలిపించుకొని, సుదీర్ఘంగా చర్చించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ మరుసటి రోజు తన తెలంగాణ పర్యటనలో కనిపించక పోవడం పట్ల బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా షాక్ కు గురైనట్లు తెలిసింది. నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొని, నడ్డా తిరిగి తిరువనంతపురం వెళ్లేందుకు విమానం ఎక్కిన తర్వాతనే పొద్దుపోయిన తర్వాత ఈటెల హైదరాబాద్ కు చేరినట్లు తెలిసింది.

వారిద్దరి వ్యవహారం చూస్తుంటే వారు బీజేపీలో కొనసాగకపోవచ్చని స్పష్టమవుతుంది. తాము లేవనెత్తిన అంశాలను వినడమే గాని, ఎటువంటి భరోసా అమిత్ షా నుండి గాని, నడ్డా నుండి గాని లభించకపోవడంతో వారిద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తో భేటీ అనంతరం వారిద్దరూ పార్టీని వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

వారిద్దరూ పార్టీని వదిలితే వారితోనే ఆగకపోవచ్చని, వరద మాదిరిగా పలువురు ప్రముఖ బీజేపీ నేతలు కూడా వరుసగా వారిని అనుసరింపవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరు నేతలు పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని అధిష్ఠానానికి ఎప్పటినుంచో సమాచారం ఉన్నది. ఇంటింటీకి బీజేపీ కార్యక్రమానికి వీరిద్దరూ డుమ్మా కొట్టడంతో హుటాహుటిన ఢిల్లీ రావాలని వారికి పిలుపు వచ్చింది.

అమిత్‌షాతో చర్చ సందర్భంగా ప్రధానంగా బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. బండి ఒంటెత్తు పోకడలు, అవగాహనా రాహిత్యం, కోటరీ వ్యవస్థ వంటి అంశాలన్నింటిని అమిత్‌షాకు వివరించినట్టు సమాచారం. ఇలాగే కొనసాగితే పార్టీకి కనీసం డిపాజిట్లు కష్టమేనని కుండబద్దలు కొట్టినట్టు చర్చ జరుగుతున్నది.

మరోవంక, బిఆర్ఎస్ తో లోపాయికారి అవగాహనలేదనే స్పష్టమైన సంకేతం ఇవ్వాలని కూడా వారు పట్టుబట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయని కూడా ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా బిజెపి అగ్రనాయకులు ఏవిధమైన స్పష్టత ఇవ్వలేక పోయారని తెలుస్తున్నది.

తాము కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయడం కోసమే బీజేపీలో చేరామని, కానీ బీజేపీ – బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు సైతం బీజేపీని తప్పుగా అర్థం చేసుకుంటారని వారిద్దరూ తేల్చి చెప్పారు.

ఇదే సమయంలో ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ పదవి గురించి స్పష్టమైన హామీ వస్తుందని వారు భావించారు. అమిత్‌షా నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ఇద్దరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందుకే భేటీ అనంతరం ముక్తసరిగా మీడియాతో మాట్లాడి, అసంతృప్తిని బయటపెట్టారని సమాచారం.

 ఇలా ఉండగా ఈ నెల 15న ఖమ్మంలో అమిత్‌షా సభను గుజరాత్‌లో తుఫాన్‌ కారణంగానే సభను రద్దు చేశామని బీజేపీ చెప్పుకొంటున్నా వాస్తవానికి ఖమ్మం సభకు ఈటల, కోమటిరెడ్డి వంటి కీలక నేతలు గైర్హాజరు అవుతారన్న పక్కా సమాచారంతోనే జరిగినదని తెలుస్తున్నది. తన సభకు ముఖ్యనేతలు రాకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో అమిత్‌షా పర్యటన రద్దు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles