నడ్డా, అమిత్ షా వ్యూహాత్మకంగానే జగన్ పై దాడులు!

Sunday, December 22, 2024

మొన్న శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, నిన్న విశాఖపట్టణంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనకు విముక్తి కలిగించేందుకు విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల మాటల దాడి వ్యూహాత్మకంగా జరుగుతున్న ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.

గత నెలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమిత్‌షా, నడ్డాలతో భేటీ అయ్యారు. ఆయన భేటీలో ఏమి జరిగిందనేది బయటకు రాలేదు. పొత్తుల లెక్కలు ఇప్పుడే తేలకపోయినా ఏపీలో పాగా వేయాలనే బీజేపీ ప్రయత్నాలు మాత్రం నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏపీలో ఒక్క సీట్ కూడా బిజెపి గెలుచుకొనే అవకాశం లేదని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే స్పష్టం చేసిన్నట్లు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల ఒక టివి ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవ్వరూ విభేదించే అవకాశం లేదు.

ఏపీలో గల 25 సీట్లలో 20 సీట్లలో బిజెపిని గెలిపించి ఆశీర్వదించాలని విశాఖ సభలో అమిత్ షా కోరారు. అయితే కనీసం బలమైన అభ్యర్థులను ఈ నియోజకవర్గాలలో నిలబెట్టే స్తోమతు కూడా బిజెపికి లేదు. జనసేనతో పొత్తు ఉన్నట్లు నాయకులు మీడియా సమావేశాలలో చెప్పడమే గాని క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీలు ఎవ్వరి దారి వారన్నట్లు వ్యవహరిస్తున్నారు.

టిడిపితో పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ఢిల్లీలో జెపి నడ్డా వద్దకు వెళ్లి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఇంకా బిజెపి సుముఖత వ్యక్తం చేయక పోయినప్పటికీ పలు సందర్భాల్లో తిరిగి టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అమిత్ షా స్పష్టం చేయడం గమనార్హం.

వైఎస్ జగన్ పట్ల ప్రధాని మోదీకి `పుత్ర వాత్సల్యం’ ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సందర్భంలో పేర్కొనడం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులకు, పలువురు కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీని, అమిత్ షాలను కలవాలి అంటే అంత సులభంగా వీలుకాదు. కానీ వైఎస్ జగన్ ఎప్పుడంటే అప్పుడు, వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చిన్నప్పుడల్లా వెళ్లి కలవగలుగుతున్నారు.

జగన్ విశాఖను సంఘ వ్యతిరేక శక్తుల అడ్డాగా మార్చారని  విశాఖ సభలో విమర్శలు గుప్పించిన అమిత్ షా ఇంటి వద్ద ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు బిజెపి నేతలు ఎవ్వరికీ లభించక పోవడం గమనార్హం. అమిత్ షా కుమారుడు జై షా స్వయంగా కారు దాగా వచ్చి, కారు తలుపు తీసి జగన్ కు స్వాగతం పలకడం, తిరిగి వెళ్లేతప్పుడు ఆ విధంగా వెంట ఉండి పంపించడం జరుగుతుంది.

మరే బిజెపి నేత, సీనియర్ కేంద్ర మంత్రులను కూడా ఆ విధంగా జై షా సాదరంగా ఆహ్వానించినట్లు తెలియదు. కారణాలు ఏమైనా ఏపీలో తిరిగి జగన్ ప్రభుత్వం ఏర్పడాలని బిజెపి అగ్రనాయకత్వం కోరుకొంటుంది. అయితే, ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై గల వ్యతిరేకత ఇటీవల కర్ణాటక ఎన్నికలలో స్పష్టం కావడంతో ఆ ప్రభావం జగన్ పై పడకూడదని జగన్ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.

పైగా, బిజెపితో స్నేహంగా ఉన్నారంటే జగన్ కు మైనారిటీలు, ఎస్సిల ఓట్లలో కొత్త పడే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవంక, జగన్ వ్యతిరేక పక్షాలలో గందరగోళం సృష్టించి, వారు ఉమ్మడిగా పోటీ చేయకుండా చూడాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles