ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అనే ఆలోచనతో ‘‘4ఏళ్ల నరకం’’ అనే పేరుతో ఒక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద గత నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి అంశంలోనూ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది, ఒక్కో రంగానికి ఎంతెంత ద్రోహం చేస్తూ వస్తున్నది.. విపులంగా ప్రజలకు తెలియజేయాలని పార్టీ నిర్ణయించింది. ‘నాలుగేళ్ల నరకం’ అనే ప్రయత్నంలో భాగంగా ప్రజల మీద జరుగుతున్న అరాచకాల గురించి ఒక వీడియోను రూపొందించి తొలుత విడుదల చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్ల నరకం పేరుతో కొన్ని వేల పోస్టర్లను ముద్రించి రోడ్ల పక్కగా గోడలమీద అతికించారు.
ఒక్కో రంగాన్ని ఎంచుకొని ఆయా రంగాల్లో జగన్ సర్కారు ఎంత అమానుషంగా ప్రగతి నిరోధకంగా వ్యవహరిస్తున్నదో, ఈ పోస్టుల ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశారు. యువతుల మీద ఈ నాలుగేళ్లలో పెరిగిన లైంగిక దాడులు, పాఠశాలలను మెర్జ్ చేయడం ద్వారా విద్యా రంగానికి జరిగిన ద్రోహం, రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే మూడోస్థానానికి ఎగబాకిన నిర్వాకం, పేదలకు చికిత్స అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో పెట్టిన వైనం, ప్రభుత్వ వేధింపులు భరించలేక రాష్ట్రం విడిచివెళ్లిపోయిన పరిశ్రమలు, యువతకు తగ్గిన ఉపాధి అవకాశాల కల్పన, జాబ్ క్యాలెండర్ అమలు గురించి అసలు పట్టించుకోకపోవడం వంటి అంశాలను ఆ పోస్టరులో ముద్రించారు. యువత మహిళలు పారిశ్రామిక రంగం విద్యా వైద్యం ఇలా వివిధ రంగాలను ఎంచుకుని ఒక్కో రంగంలో ప్రభుత్వం అనుసరించిన దుర్మార్గాలను తెలియజెప్పడం ఈ పోస్టల్ లక్ష్యంగా కనిపిస్తుంది
నాలుగేళ్ల నరకం పేరుతో జగన్ సర్కారు వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఒక్కో అంశం మీద చిన్న చిన్న వీడియోలు రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ అందేలాగా సోషల్ మీడియా ద్వారా ఇతర రూపాలలో వాటిని చేరవేయడం, ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టర్లను ముద్రించి అన్నిచోట్ల అతికించడం, అలాగే కరపత్రాలు ఇతరత్రా రూపాలలో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి జగన్ సర్కారు వైఫల్యాలు గురించి తెలియజెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.