ధర్నా చౌక్ గా మారుతున్న గాంధీ భవన్

Monday, January 20, 2025

మరో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు మంచి జోష్ తో ముందుకు వెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ ప్రధాన కార్యాలయం `గాంధీ భవన్’ సమస్యాత్మకంగా మారుతుంది. కొన్ని సమయాలలో అక్కడకు వెళ్లాలంటే కొందరు సందేహించే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ వారి నుండే నిరసనలు, ఆందోళనలు, చివరకు ధర్నాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వెనుకడుగు వేస్తున్నారు. 

హైదరాబాద్ లో ఎవ్వరు ఏ అంశంపై నిరసన తెలపాలి అన్నా ప్రభుత్వమే అధికారికంగా ఎన్టీఆర్ పార్క్ ప్రాంతాన్ని కేటాయించింది. దానికి `ధర్నా చౌక్’గా నామకరణం కూడా చేశారు. అయితే కాంగ్రెస్ లో అసంతృప్తివాదులు మాత్రం `గాంధీ భవన్’ వద్దనే తమ నిరసనలు సాగిస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు అంతులేదనే చేదు సంకేతం ప్రజలకు వెడుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల తరచుగా గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు, నిరసనలు జరుపుతూ ఉండటం పట్ల టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ విధంగా చేస్తున్న వారి వివరాలు సేకరించామని పార్టీ నేతలను కోరారు. అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఇదే విషయమై అనేక నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. శనివారం రేవంత్ రెడ్డి గాంధీభవన్ వచ్చే సరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. 

దీంతో నిరసనలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు  కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్ష నియామకాలపై నిరసనలు చేపట్టిన కార్యకర్తలు, నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యల కింద వారిని సస్పెండ్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

కమిటీల నియామకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డిలకు వినతి పత్రం ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

 ముఖ్యంగా శనివారం ఆందోళన చేస్తున్న వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలకు 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించామని రేవంత్ గుర్తుచేశారు. 

ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.  ముందుగా కాంగ్రెస్ పార్టీలోని మండల కమిటీల నియామకాలు మునుగోడు, భువనగిరి నియోజకవర్గంలో కాకపుట్టించాయి. గత వారం చిన్నగా మొదలైన లొల్లి ఇప్పుడు తీవ్రసమస్యగా మారింది.

 ప్రస్తుతం ఈ సమస్య గజ్వేల్, ఖానాపూర్, ఖమ్మం, రామగుండం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, మహేశ్వరం, కల్వకుర్తి, ఆలేరు, కోదాడ, సిద్దిపేట, నారాయణఖేడ్, జనగామ, పాలకుర్తి, ఎల్లారెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పెను దుమారాన్ని సృష్టించింది. ఈ నియోజకవర్గాల నాయకులు ప్రతిరోజూ గాంధీభవన్‌కు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles