ద్వితీయ శ్రేణి నాయకత్వంపై చంద్రబాబు ఫోకస్‌

Saturday, November 16, 2024

సుదీర్ఘకాలం టిడిపిలో ఉంటూ, 2019లో అధికారం కోల్పోగానే పార్టీ కార్యక్రమాలను సరిగ్గా పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తిరిగి క్రియాశీలకంగా కనిపిస్తున్న నాయకులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓ కన్నేసి ఉంచుతున్నట్లు తెలుస్తున్నది. తాము కాగా మరెవ్వరు నియోజకవర్గంలో ఎదగనీయకుండా, తామే ఇన్ ఛార్జ్ లుగా ఉంటూ, పార్టీ గురించి పట్టించుకోకుండా ఉంటున్న వారిని వచ్చే ఎన్నికలలో మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.

ఎట్లాగూ 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని ప్రకటించడంతో ద్వితీయ శ్రేణి నాయకులను పలు చోట్ల ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ దిశలో పలు నియోజకవర్గాలలో ఇన్ ఛార్జ్ లను కూడా మార్చేందుకు సిద్దపడుతున్నారు. మంత్రులుగా, రెండు- మూడు పర్యాయాలు ఎమ్యెల్యేలుగా పనిచేసిన వారికి సహితం ఈ సారి పోటీ చేయవద్దని స్పష్టం చేయనున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే కొందరు నేతలతో వారికి సీట్ ఇవ్వడం కుదరదని, వారి కుటుంభం సభ్యులు ఎవరివైనా పేర్లు చెబితే పరిశీలిస్తామని చెప్పేసిన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  తాజాగా జరిగిన సమీక్షలలో ఈ సందర్భంగా చంద్రబాబు కఠిన ధోరణి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  పార్టీలో పని చేస్తారా? లేక తప్పుకుంటారా? అని ఓ విధమైన హెచ్చరిక చేస్తున్నారు.

పార్టీ కోసం పని చేయలేని వారు ఉంటే తప్పుకోవాలని ప్రత్యామ్నాయం చూసుకుంటామని తేల్చి చెప్పడంతో  పలువురు నేతలు షాక్‌ అయ్యారు. పని చేస్తానని చెబుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తూ ఉండడంతో నివ్వెరపోతున్నారు. ఇంకొకవైపు రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేయటం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది.

ఒకవైపు జనసేన, బిజెపిలతో పొత్తులనే చర్చలు జరుగుతుండగా, అన్ని సీట్లకు సిద్ధపడాలని సంకేతం ఇవ్వడంతో పార్టీ నేతలలో ఒక విధమైన గందరగోళం ఏర్పడింది. అనేక నియోజకవర్గాలో టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు అధిష్టానానికి అందుతున్నాయి. దానితో పార్టీ కార్యక్రమాల నిర్వాహణ, ఇతర అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకోని నేతలకు ఉద్వాసన పలికి,  ఆయా స్థానాల్లో కొత్త వారికి, ఆశావహులకు అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ సారి ఎన్నికలు పార్టీకి జీవస్మరణ ఎన్నికలుగా మారడంతో,  ఎలాగైనా కోల్పోయిన అధికారాన్ని దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకవంక ప్రజలకు దగ్గరవుతూనే, మరో వైపు పార్టీ ప్రక్షాళనకు అధిష్టానం చర్యలు చేబడుతున్నారు. ఇప్పటికే నేతల పని తీరుపై నిఘా పెట్టిన ఆ పార్టీ అధిష్టానం ఒకొక్క నేత గురించి సమగ్ర సమాచారం సేకరించింది.

ప్రస్తుతం తాజాగా పార్టీ “భవిష్యత్‌ కు గ్యారెంటీ” పేరుతో ప్రకటించిన  మినీ మేనిఫెస్టో  గురించి ప్రజలలో ప్రచారం చేసేందుకు చేపట్టిన చైతన్య యాత్రలు సాగుతున్న తీరును అధిష్టానం పూర్తి స్థాయిలో గమనిస్తోందని చెబుతున్నారు. ఈ యాత్రలలో వెనుకబడిన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు ఉద్వాసన పలికేందుకు కూడా సిద్దపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles