అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న దొంగ ఓట్ల గురించి అమితంగా ఆందోళన చెందుతున్నారు. ఊరూరా విచ్చలవిడిగా డోరు నెంబరు కూడా లేకుండా దొంగఓట్లు నమోదు అవుతున్నాయంటూ.. చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే.. 2014 నుంచి దొంగ ఓట్ల నమోదు గురించి పరిశోధన చేయాలంటూ.. విజయసాయిరెడ్డి కోరడం కూడా అందరికీ తెలుసు. దొంగఓట్లకు బాధ్యులుగా ఒకరి మీదకు మరొకరు నెపం మోపుకుంటున్నారు. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మాత్రం.. దొంగ ఓట్ల బెడదకు ఒక పరిష్కారం చూపిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రమంతా ఒకేరోజున నిర్వహించాలని ఆయన అంటున్నారు. ఒక జిల్లా వారిని మరొక జిల్లాలో దొంగఓటర్లుగా విచ్చలవిడిగా నమోదు చేయించారని.. వీరందరినీ రాత్రికి రాత్రి తరలించేసి.. వారితో దొంగఓట్లు వేయించే ప్రణాళికతో ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయం తాను ప్రత్యేకంగా చేయించిన ఒక సర్వేద్వారా తెలుసుకున్నానని కూడా విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు.
విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించి 2.6 లక్షల ఓట్లలో ఇప్పటిదాకా ఆయన 66 వేల ఓట్లు తనిఖీ చేయించగా, 15 వేల మందికి పైగా ఆయా అడ్రసుల్లో లేరు అనే సంగతి బయటపడిందని సాక్ష్యాలతో సహా వెల్లడిస్తున్నారు.
బిజెపి నేత విష్ణుకుమార్ రాజు చేస్తున్న సూచన బాగానే ఉంది. నిజానికి ఒకే రోజున రాష్ట్రమంతా ఎన్నిక నిర్వహించడం అనేది ఆచరణలో కొంత ఇబ్బందికరమే అవుతుంది గానీ.. ప్రజాస్వామ్యం నిజాయితీగా ఉండాలంటే.. ఎన్నికలు నిజాయితీగా ఫలితాలు ఇవ్వాలంటే తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు.. లారీల్లో ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలనుంచి కూడా జనం తరలివచ్చి ఓట్లు వేసిన వైనం ప్రజలు గమనించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు.. అయిదోతరగతి చదివిన వారు కూడా.. అసలు.. ఏం ఎన్నికకు వెళుతున్నామో కూడా తెలియకుండా.. లైన్లలో ఓట్లు వేసిన వారు అనేకులు ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ ప్రజలు టీవీ ఛానెళ్లలో చూశారు. ఈ దొంగఓట్లు అన్నీ ఎవరికి అనుకూలంగా పడ్డాయో కూడా ప్రజలకు తెలుసు. ఈ నేపథ్యంలో దొంగఓట్ల అక్రమాలు అరికట్టడానికి ఈసీ చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దొంగఓట్ల బెడదకు రాజుగారి సలహా!
Wednesday, January 22, 2025