దేశంలోని రాజకీయ నాయకులు అందరిలో బహుశా సంపన్నమైన నేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన సంపద అంతా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండే పెరుగుతూ రావడం గమనార్హం. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో చూపిన లెక్కల ప్రకారమే ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో ఆయన సంపన్నులు.
అంతేకాదు, మొత్తం 30 మంది ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, వాటిలో సగంకు పైగా కేవలం జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నాయి. తన ఆస్తుల విలువ రూ.510 కోట్లని స్వయంగా ఆయనే తన 2019 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల విలువ కలిపి రూ.1,018.86 కోట్లు ఉంటే, అందులో 50.09 శాతం ఆస్తులు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదే ఉన్నాయి. దేశంలో మిగిలిన 29 మంది ముఖ్యమంత్రి ఆస్తుల విలువ కలిపి రూ.508 కోట్లుగా ఉన్నాయి.
జగన్ మోహన్‌రెడ్డి ఆస్తి విలువ రూ.510.38 కోట్లుగా ఉంది. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు ఉండగా, మిగతావి స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు నేతృత్వం వహిస్తున్న 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా ఈ వివరాలు వెల్లడించాయి.
తాజా ఏడిఆర్ జాబితా ప్రకార పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందరి కంటే తక్కువగా రూ.15 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడున్న 30 మంది ముఖ్యమంత్రులలో 29 మంది కోటీశ్వరులేనని వెల్లడైనది. అంటే, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం, అంటే 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు.
ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ.33.96 కోట్లుగా ఉంది. రూ.510 కోట్లతో జగన్ మొదటి స్థానంలో, రూ.163 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో, రూ.63 కోట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆస్తి కోటి రూపాయలు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తి కోటి రూపాయల పైనే ఉందని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికలు వెల్లడించాయి. వీరు ముగ్గురు దేశంలోని ముఖ్యమంత్రులతో అత్యంత తక్కువగా ఆస్తులు గలవారు.