దూకుడుగా ఈడీ .. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న కవిత!

Tuesday, November 5, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఒక వంక దూకుడుగా వెడుతున్న ఈడీ, మరోవంక అరెస్ట్ తప్పదని గ్రహించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితలకు సంబంధించి గురువారం నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా గురువారం విచారణకు హాజరుకావాల్సిన కవితను అరెస్ట్ చేయబోతున్నట్లు కధనాలు వెలువడ్డాయి.

గత శనివారం విచారణకు హాజరైన ఆమెను దాదాపు పది గంటలసేపు ప్రశ్నించి, తిరిగి మరోసారి  మార్చి 16వ తేదీన కూడా హాజరుకావాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం విచారణకు కవిత దూరంగా ఉన్నారు. పలు కారణాల రీత్యా రాలేనంటూ ఈడీకి తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు.

ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు. విచారణకు ఆమె హాజరుకాకపోవటంతో  ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 20వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

అయితే ఈడీ దర్యాప్తు అంశంపై ఇప్పటికే కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై మార్చి 24వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలో మార్చి 20వ తేదీన ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 20వ తేదీన కవిత విచారణకు హాజరవుతారా..? ఈడీ ఏం చేయబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

బిఆర్‌ఎస్‌ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఈడీ దర్యాప్తు పేరుతో వేధిస్తోందని కవిత తరపు న్యాయవాది ఆరోపించారు. కవిత తరపున పలు ఈడీ కోరిన పలు డాక్యుమెంట్లను సమర్పించినట్లు సోమా భరత్ చెప్పారు. మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50లో నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేయడాన్ని ప్రశ్నించినట్లు అడ్వకేట్ తెలిపారు.

 ఈడీ కేసుల్లో నిందితులుగా, సాక్ష్యులుగా విచారించడానికి ఉన్న వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి ప్రస్తుతం విచారణ జరిపారని ఆరోపించారు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు, చట్టాలను ధిక్కరించి ఈడీ అధికారులు వ్యవహరించారని, 15ఏళ‌్లలోపు పిల్లలు ఉన్న మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఈడీ ఇచ్చిన నోటీసులపై చట్ట ప్రకారం ఇంటి వద్దే విచారణ జరపాలని కోరినా, ఆమెకు గడువు ఇవ్వలేదని విమర్శించారు. 11వ తేదీన చట్టానికి సహకరించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట ప్రకారం విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు.

ఈ క్రమంలో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్‌ ఫైల్ చేశామని, 24న ఆ కేసు విచారణకు రానుండటంతో ఈడీకి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ గత వారం అడిగిన 12 సెట్ల పత్రాలను అధికారులకు సమర్పించినట్లు సోమాభరత్ చెప్పారు.ఈడీ నమోదు చేసిన అక్రమ కేసును చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కాకపోవడానికి అనారోగ్యం కారణం కాదని సోమా భరత్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ జరగడం లేదని, చట్టబద్దంగా తమకు ఉన్న హక్కులని అమలుచేయాలని తాము కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈడీకి తెలియచేసినట్లు చెప్పారు.

కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని కోరినట్లు విజ్ఞప్తి చేశామన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారించాలని ఈడీ అధికారులను కోరినట్లు తెలిపారు. కవిత సెల్‌పోన్‌ను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కవిత లేఖలో ఆరోపించారు.

వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో లేకపోవడంతో తన తరపున లాయర్‌ను పంపించానని కవిత తన లేఖలో పేర్కొనడం గమనార్హం.  ఇడి కోరిన డాక్యుమెంట్లను పంపించానని, సుప్రీం కోర్టు నిర్ణయం తరువాత విచారణకు హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన సమన్లలో ఎక్కడా ఫోన్ సీజ్ చేస్తామని చెప్పలేదని, అయినా విచారణ సమయంలో తన పోన్ సీజ్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే 20వ తేదీన విచారణకు హాజరుకాకపోతే కవితను అరెస్ట్ చేస్తుందా..? లేక కోర్టు విచారణ నేపథ్యంలో అప్పటివరకు ఆగుతుందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles