`దీక్షా దివస్’ పై కవిత, రేవంత్ ట్విట్టర్ వార్!

Friday, December 20, 2024

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని ‘దీక్షా దివాస్’ నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్యెల్సీ కవిత చేసిన ట్వీట్ రాజకీయ వివాదంకు దారితీసింది. తండ్రి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అన్నట్టు కవిత ఓ ట్వీట్ చేశారు. ‘కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో’ అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కెసిఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు… నవంబర్ 29, దీక్షా దివాస్” అంటూ ఆమె గుర్తు చేశారు. 

“ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సిఎం కెసిఆర్ గారి సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’ అని కవిత ట్వీట్ చేశారు.

అయితే ఆమె ట్వీట్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇది దీక్ష దివాస్ కాదు.. దగా దివాస్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేయడంతో కవిత తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే… బతుకమ్మ ఆడినందుకే… బోనం కుండలు ఎత్తినందుకే … మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే… తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!?’ అని ఓ ట్వీట్ లో ప్రశ్నించారు. 

‘అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అందుకే… త్యాగాలు చేసిందెవరు, భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

రేవంత్ ట్వీట్ పట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు, బతుకమ్మ, బోనాలను రేవంత్ రెడ్డి కించపరిచారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల నోట బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసి వారి చేత బతుకమ్మ ఎత్తించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే అవుతుందని ఆమె స్పష్టం చేశారు. 

 ‘చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై ” తుపాకీ ” ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకే పరిమితం చేస్తూ మాట్లాడడం అనేది మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది’ అంటూ రేవంత్ పై ఎదురు దాడికి దిగుతూ కవిత ట్వీట్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles