దిగ్విజయ్ సింగ్ సర్ది చెబుతున్నారా? మందలిస్తున్నారా!

Saturday, January 18, 2025

తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు అస్త్రం ప్రయోగించిన కొందరు సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానం తమను అంతగా పట్టించుకోవడం లేదని ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. టిపిసిసి కార్యవర్గ సమావేశంను కూడా బహిష్కరించి, రేవంత్ నాయకత్వంలో పనిచేసే ప్రసక్తి లేదని ఘర్జించడంతో తమను వెంటనే ఢిల్లీకి పిలిపించి, రేవంత్ ను మందలిస్తారని ఆశించారు. 

అయితే తమ తిరుగుబాటును లెక్కచేయకుండా మరుసటి రోజు రేవంత్ రెడ్డి టిపిసిసి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో దాదాపు 90 శాతం మంది నాయకులు పాల్గొనడం, పైగా తాము లేకుండానే పాదయాత్ర, జిల్లాలవారి సదస్సులు వంటి పలు కార్యక్రమాలను ఖరారు చేయడంతో వీరంతా ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది. 

పైగా, విబేధాల పరిష్కారం కోసం అంటూ హైదరాబాద్ వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ ధోరణి సహితం వారికి అంతుబట్టడం లేదు. ఆయన నాయకుల మధ్య విబేధాలు సర్దుబాటు చేయడానికి వచ్చారా? లేదా తమను మందలించడానికి వచ్చారా? అని తిరుగుబాటు నేతలు వాపోతున్నారు. 

దిగ్విజయ్ ఒకొక్క నేతను పిలిచి తెలంగాణాలో పార్టీ పరిస్థితి, కమిటీల నియామకంలపై అసంతృప్తుల వాదనలు ఓపికగా వినడంతో పాటు ఆయన వేస్తున్న మూడు ప్రశ్నలు వారిని ఇరకాటంలో పడేస్తున్నాయి. బిఆర్ఎస్ ను ఓడించేందుకు తమ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు? .ఏం చేయబోతున్నారు..? 

చివరగా, అంతర్గత సమస్యలపై అభిప్రాయాలు పరిష్కారం కోసం సలహాలు ఏంటని వరుస ప్రశ్నలు అడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రశ్నలు అడుగుతూనే మరోవైపు నేతలను సున్నితంగా మందలిస్తున్నట్లు చెబుతున్నారు.  పార్టీలో జూనియర్, జూనియర్ పంచాయతీ ప్రస్తావనే ఉండొద్దని స్పష్టం చేయడం ద్వారా రేవంత్ వర్గంపై వారు లేవనెత్తుతున్న అభ్యంతరాలను తిప్పికొడుతున్నట్లు కనిపిస్తున్నది. 

పైగా,  ఎవరూ ఏం చేస్తున్నారో హైకమాండ్ అంతా గమనిస్తుందని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆయన వరుస చూస్తే దారిలోకి రాకపోతే వారిని వదులుకోవడానికి పార్టీ వెనుకడుగు  వేయబోదనే సంకేతం ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. 

ఈ పరిణామాలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమైన అసమ్మతి నేతలు కొత్త కమిటీల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమను సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ సీనియర్లు ఆరోపణలు గుప్పించారు. 

అయితే, ఆ సమావేశం ఏర్పాటు చేసిన మాజీ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అందులో పాల్గొన్నవారు ఈ పరిణామాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.  అసమ్మతి వ్యక్తం చేయగానే పార్టీ అధిష్ఠానం తమను పిలిపించి, తమతో మాట్లాడుతోందని తమను తప్పుదారి పట్టించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పైగా, తాము లేకుండానే రేవంత్ రెడ్డి కార్యవర్గ సమావేశం జరిపి, తన దారిలో తాను పోతూ ఉండడం, అధిష్ఠానం కూడా తప్పుబట్టుతున్నట్లు వెల్లడి అవుతూ ఉండడంతో ఇప్పుడేమి చేయాలో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారని చెబుతున్నారు. మరోవంక, ఆరేళ్లుగా తాము పార్టీకోసం  కష్టపడి పనిచేస్తుంటే టిడిపి వాళ్లమని, జూనియర్లమని తమపై నిందలు వేయడం ఏమిటని అంటూ రేవంత్ వర్గీయులు కూడా ఫిర్యాదు చేశారు. 

చివరకు రేవంత్ రెడ్డిని మార్చమని డిమాండ్ వదులుకోని రాష్ట్ర ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను మార్చేటట్లు చేయడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఇప్పుడు పట్టుబట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles