నాలుగువందల రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్ల పొడవున చేయదలచుకుంటున్న పాదయాత్రకు, సరిగ్గా మూడు రోజుల ముందు పోలీసులు అనుమతి ఇచ్చారు. నారా లోకేష్ పాదయాత్రకు ఎలాంటి విఘ్నాలు సృష్టించాలా? ఎలా జాప్యం చేయాలా? అని శతవిధాల మార్గాలను అన్వేషించిన పోలీసులు చివరికి మార్గాంతరం లేక.. అనుమతులు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో యాత్రకు బోలెడు నిబంధనలు కూడా విధించారు.
పాదయాత్ర సందర్భంగా రోడ్డు మీద వెళ్లే ఇతర ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదనే నిబంధనను అర్థం చేసుకోవచ్చు. నాలుగువందల రోజుల పాటు జరిగే సుదీర్ఘ యాత్రలో ఇలాంటి పనులకు ఎవరూ తెగించరు. సరే పోలీసులు ఆ నిబంధన పెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. బహిరంగ సభల విషయంలో టైంకు కట్టుబడి ఉండాలని, ఆస్తులకు నష్టం కలిగించకూడదని చెప్పడం ఏదో హెచ్చరికలాగా ధ్వనిస్తోంది. అదే సమయంలో యాత్ర వెంట చికిత్స పరికరాలతో సహా అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలని, అగ్నిమాపక యంత్రాన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలని పోలీసులు చెప్పడం కొంచెం అతిగా ఉంది. ఇవన్నీ వెంటబెట్టుకుని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి యాత్ర సాగించారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. జీవో నెం.1 లో ఉన్న నిబంధనలను కూడా విడిగా పోలీసులు ఈ పాదయాత్రకు విధించేశారు. రోడ్ల మీద ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని అన్నారు.
అంటే నారాలోకేష్ యాత్ర పొడవునా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ప్రతి సందర్భానికీ సభ రూపంలో పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనా? యాత్రలో భాగంగా నడుస్తున్నప్పుడు ఏదైనా గ్రామం వద్ద ప్రజలు కాస్త పెద్ద సంఖ్యలో హాజరైతే వారిని ఉద్దేశించి అప్పటికప్పుడు మాట్లాడడానికి ఉండదా? లాంటి అనుమానాలు ఉన్నాయి. అలా అసలు పాదయాత్ర వంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు సాధ్యమవుతుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అనుమతులు ఇస్తున్నట్టుగా ప్రకటించిన సందర్భంలో పోలీసు అధికారులే ఓ మాట అన్నారు. అనుమతి ఇవ్వకముందే కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కక్ష సాధిస్తున్నట్టుగా ప్రచారం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు అడుగుతూ లేఖలు ఇచ్చిన తర్వాత.. పదిరోజుల పాటు అసలు స్పందించకుండా, పద్నాలుగు రోజుల తర్వాత ఇన్ని నిబంధనలతో అనుమతించిన పోలీసులు.. అసలు అలాంటి సోషల్ మీడియా ప్రచారానికి జడుసుకునే ఇచ్చినట్టుగా కనిపిస్తోందని ప్రజలు భావిస్తున్నారు.
దిగివచ్చిన సర్కార్.. ‘లోకేష్ యువగళం’కు అనుమతి!
Wednesday, January 22, 2025