తన కుమారుడు హితేష్, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్టీ రామారావు పెద్దల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోడల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రకటించడం ఒక విధంగా వినోదం కలిగిస్తుంది. ఆయన, ఆయన కుమారుడు ప్రస్తుతం అసలు రాజకీయాలలో ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఎన్నికలకు మరో సంవత్సరంన్నర సమయం ఉండగా ఇప్పుడు ఆయన ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనే అనుమానం కలుగుతుంది. ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భార్య పురందేశ్వరి రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది.
వాస్తవానికి 2014 ఎన్నికలకు సమయం నుండే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ సమయంలో భార్య పురందేశ్వరి బీజేపీలో చేరి, రాజంపేట నుండి పోటీ చేసినా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కొడుకు హితేష్ ను రాజకీయాలలోకి తీసుకు రావాలని, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, ఆ పార్టీలో చేర్పించారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పరుచూరు నుండి పోటీచేయించేందుకు ప్రయత్నం చేశారు.
హితేష్ కు వైసీపీ సీట్ ఇచ్చినా అమెరికా పౌరసత్వంకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడడంతో పోటీచేయలేక పోయారు. దానితో చివరి నిముషంలో స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీచేసి ఓటమి చెందారు. ఆ ఓటమి తర్వాత కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఈ లోగా ఓ పండుగకు టీడీపీ ఎమ్యెల్యేగా ఉంటున్న నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా కారంచేడులో ఇంటికి రావడంతో హితేష్ ను టిడిపిలో చేర్పించనున్నట్లు కధనాలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో దగ్గుబాటి, చంద్రబాబులు సహితం కలుసుకోవడంతో వారిద్దరి మధ్య సానుకూలత ఏర్పడినట్లు అందరూ భావించారు.
అయితే హితేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేయడం, పురందేశ్వరి బిజెపి అభ్యర్థిగా విశాఖపట్నం నుండి పోటీచేయడం … ఇద్దరు ఓడిపోవడంతో బిజెపి కేంద్ర నాయకత్వం తీవ్ర అంశంగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. కుటుంభం ఒక పార్టీలో, ఆమె మరో పార్టీలోనా అనే ప్రశ్నలు తలెత్తాయి. పైగా ఆమెతో కాంగ్రెస్ నుండి చెప్పుకోదగిన వారెవరు బీజేపీలో చేరలేదు.
అందుకనే గతంలో ఆమెను రాజ్యసభకు పంపిస్తామని చెప్పిన బీజేపీ అధిష్టానం ఆ తర్వాత పట్టించుకోలేదు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి సహితం ఆమెను పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఇప్పుడు కూడా హితేష్ ను టిడిపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎందరో భావిస్తున్నారు. గత ఏడాది బాలకృష్ణ కారంచేడులో వారింటికి ఓ పండుగకు కుటుంబం సమేతంగా వెళ్లిన సందర్భంగా ఈ విషయమై కథనాలు వెలువడ్డాయి. టిడిపి సీటు ఇచ్చే విషయమై ఇప్పటి వరకు చంద్రబాబు ఎటువంటి సానుకూల సంకేతాలు ఇవ్వని లేదు.
అందుకనే ఆ సీటు కోసం ప్రయత్నం చేస్తే, పురందేశ్వరికి బీజేపీలో భవిష్యత్ ఉండదనే భయంతోనే దగ్గుబాటి `రాజకీయ సన్యాసం’ గురించి ప్రకటన చేశారని తెలుస్తున్నది.