తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న సరికొత్త విభజన సమస్య

Wednesday, December 18, 2024

కేంద్ర ప్రభుత్వపు నిర్లక్ష్య ధోరణి, రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిష్క్రియ కారణంగా పదేళ్లు అవుతున్నా విభజన వివాదాలు తెలుగు ప్రజలను ఇంకా వేధిస్తున్నాయి. వివాదాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మినహా సామరస్య పూర్వకంగా పరిష్కారం కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. మరోవంక కేంద్ర ప్రభుత్వం కూడా తన కర్తవ్యం నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేసి చేతులు దులుపుకొంటున్నది.

ఇటువంటి సమయంలో తాజాగా మరో జటిల సమస్య విభజనకు సంబంధించి తెరపైకి వచ్చింది. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ శాఖలన్నీ ఉమ్మడి 25 జిల్లాలకూ సేవలు అందించాలని ఉంది. ఈ ఉత్తర్వుల్లోని క్లాజ్‌-1లో ఈ విషయం స్పష్టంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అటు కార్యాలయాలు, ఇటు అనేక ప్రాజెక్టులను కూడా పేరుపేరునా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

అయితే రాష్ట్ర విభజన జరగడంతో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సిఉందని, అలా జరగకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ప్రస్తావించిన శాఖలు, పథకాలను సిఎస్‌ ప్రస్తావిస్తూ వాటి వివరాలను, తాజా పరిస్థితిని వివరించాలని అన్ని శాఖలను ఆదేశించారు. 

ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎసిబి, పౌరసరఫరాల శాఖలోని విజిలెన్స్‌ విభాగం, రైల్వే పోలీస్‌, ఫ్లయిరగ్‌ స్వాడ్స్‌, అసిస్టెంట్‌ ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలు, భారీ, మధ్యతరహ నీటిపారుదల ప్రాజెక్టుల ఇన్‌వెస్టిగేటింగ్‌ సర్కిల్స్‌, రిగ్స్‌ డివిజన్స్‌, వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ సర్కిల్స్‌ వంటివి ఉన్నాయి.

ఇవికాక, మరో 51 విభాగాలు కూడా ఉన్నాయి. అలాగే మరికొన్ని శాఖలకు సంబంధించి పోస్టుల పైనా అప్పటి ఉత్తర్వుల్లో ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆయా శాఖలకు సంబంధించిన తాజా వివరాలను సమర్పించాలని ప్రధాన కార్యదర్శి కోరారు. 

ఈ వివరాలతోపాటు ఆయా శాఖలు, సంస్థలకు సరబంధించిన సిఫార్సులు, రిమార్కులను కూడా సమర్పించాలని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రపతి ఉత్తర్వులపై అప్పట్లోనే సాధారణ పరిపాలన శాఖ కూడా రాష్ట్రంలో గెజిట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 33 నీటిపారుదల పథకాలు కూడా ఉన్నాయి.

వాటిల్లో ప్రధానంగా వంశధార, ధవళేశ్వరం, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, పోచంపాడు, కృష్ణా గోదావరి డెల్టా, సోమశిల, జూరాల, తెలుగు గంగ, విశాఖపట్నం వాటర్‌ స్లప అభివృద్ధి పథకం వంటివి ఉన్నాయి.

ఇదే సమయంలో ఇప్పుడు దాదాపు ఐదు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న పోలవరం ప్రాజెక్టును కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. వీటన్నింటిని క్రోడీకరించిన తరువాత సవరణ ఉత్తర్వుల కోసం కేంద్రాన్ని కోరే అవకాశం ఉందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles